తెలంగాణలో విద్యుత్ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ముందుగా యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో 10 వేల కోట్లను జగదీశ్ రెడ్డి తిన్నారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి ధీటుగా స్పందించారు.కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీశ్ రెడ్డి కోరారు. ఆ విచారణలో దోషులు దొరికితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు. లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. తప్పకుండా ఈ విషయం తేలాలని అన్నారు. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్నానని.. కానీ ఏ ఒక్కరోజు కూడా రియాక్ట్ కాలేదని చెప్పారు. ఇవన్నీ పనికిమాలిన మాటలు.. అర్థం లేని.. ఆధార రహితమైన మాటలు అని అన్నారు. ఇవన్నీ రికార్డుల్లోకి రావాలనే ఇన్ని రోజులు వెయిట్ చేశానని.. ఇవాళ రికార్డుల్లోకి వచ్చాయని అన్నారు.
దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆ విచారణతో పాటు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా విచారణ చేయాలన్నారు. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. అది మీరు చేయగలుగుతారా? ప్రజా కోర్టులో తేలుస్తామా అనేది చూడాలన్నారు.