శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌లో భారీ భద్రతా లోపం బయటపడిన విషయం తెలిసిందే. లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కలర్ స్మోక్ వెదజల్లడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు బెంగళూరుకు చెందిన టెకీ కాగా, మరొకరు ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌కు చెందిన అతుల్‌గా గుర్తించారు.ఆ ఇద్దరిలో టెకీని కర్ణాటకలోని బాగల్‌కోట్ కు చెందిన రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుమారుడు సాయికృష్ణ గా గుర్తించారు. డిసెంబర్ 13న లోక్‌సభ చాంబర్‌లోకి చొరబడిన మనోరంజన్‌కు సాయికృష్ణ స్నేహితుడు అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సాయికృష్ణ, మనోరంజన్‌లు బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బ్యాచ్‌మేట్స్‌గా గుర్తించినట్లు వెల్లడించాయి. ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం చేస్తున్న సాయికృష్ణను ఢిల్లీ పోలీసులు బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బాగల్‌కోట్‌లోని అతని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం సాయికృష్ణను ఢిల్లీకి తీసుకొచ్చారు.కాగా, పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన నిందితుల్లో లోక్‌సభలోకి చొరబడిన మనోరంజన్, సాగర్ శర్మ, పార్లమెంటు వెలుపల పొగ డబ్బాలు ఉపయోగించిన అమోల్ షిండే, నీలం ఆజాద్‌లు ఉన్నారు. లలిత్ ఝా భద్రతా ఉల్లంఘనకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. లలిత్‌తోపాటు అతనికి సాయం చేసిన మహేష్ కుమావత్‌ను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.