cottage enterprise-guns
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

విజయనగరంలో కుటీర పరిశ్రమగా తుపాకులు తయారీ

విజయనగరం జిల్లాలో నాటు తుపాకీల తయారీ కలకలం రేపింది. ఎల్ కోట మండలం గొల్జాంలో నాటు తుపాకీ తయారు చేస్తున్న ముసినాన కన్నబాబు అనే వృద్ధుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. కన్నబాబు అరెస్ట్ వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. కన్నబాబు నాటుతుపాకీ తయారీలో నిష్ణాతుడు. సుమారు ఇరవై ఏళ్ల క్రితం స్నేహితుల సహాయంతో తుపాకుల తయారీ నేర్చుకున్నారు. అప్పటి నుండి నాటు తుపాకీలు తయారు చేసి వాటిని విక్రయించి తన జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం తుపాకీలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో కన్నబాబు స్థావరం పై పోలీసులు దాడి చేశారు. అలా నాటు తుపాకులు తయారుచేస్తున్న కన్నబాబును రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు పోలీసులు.ఆ కేసులో కన్నబాబుకి రిమాండ్ విధించడంతో జైలు జీవితం కూడా అనుభవించి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఆ తరువాత కొన్నాళ్లు ఖాళీగా ఉన్నాడు. అయితే అరవై ఐదేళ్ల వయస్సున్న ఉన్న కన్నబాబు తన జీవనం సాగించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు.

ఇతర ఏ పని చేసుకునే ఓపిక కానీ, వేరొక పనిగానీ తెలియాదు. దీంతో బ్రతకు తెరువు కష్టంగా మారింది. ఇక చేసేదేమిలేక తనకు తెలిసిన పని అయిన నాటు తుపాకీల తయారీని తిరిగి ప్రారంభించారు. ముందుగా తనకు తెలిసిన వారి వద్దకు వెళ్ళి తుపాకీ గొట్టాలు తయారు చేసుకున్నారు. తరువాత తుపాకులకు వాడే చెక్కను కొనుగోలు చేసి ఇతర సామాగ్రిని తయారు చేశారు. అలా అన్ని పరికరాలు సేకరించి రెండు తుపాకులు తయారు చేశారు.మరో తుపాకీ తయారు చేస్తుండగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసి కన్నబాబును అదుపులోకి తీసుకున్నారు. కన్నబాబు తయారు చేసిన తుపాకులను, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కన్నబాబు అరెస్ట్ తరువాత పోలీసులు తుపాకీల తయారీ వ్యవహారం పై ముమ్మర విచారణ చేపట్టారు. కన్నబాబు తుపాకీలు ఎందుకు తయారు చేస్తున్నాడు? ఎవరు తయారు చేయమంటే చేస్తున్నాడు? ఎవరికి విక్రయించేందుకు చేస్తున్నాడు? గతంలో తయారు చేసి ఎవరికైనా విక్రయించాడా? ఒక్కో గన్ ఎంత ధరకు అమ్ముతాడు? ఎన్ని సంవత్సరాల నుండి తయారు చేస్తున్నాడు? ఇలా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అందుకోసం ఒక ప్రత్యేక టీమ్ ను కూడా ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు.

కన్నబాబుకు భార్య, పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారికి కూడా తెలియకుండా ఇంటికి దూరంగా వేరొక చోట ఈ తుపాకీల తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారుకన్నబాబు. అతనికి కనీసం ఫోన్ కూడా లేకపోవడంతో తుపాకులకు సంభందించిన వివరాలు ఆరా తీయడం పోలీసులకు కష్టంగానే మారింది. తుపాకీలకు సంభందించిన ఏ వివరాలు అడిగినా పొట్ట కూటికి కూడా కష్టంగా ఉందని, ఏమి చేయాలో తెలియక తనకు తెలిసిన తుపాకుల తయారీ పనిచేస్తున్నానని చెప్తున్నాడు కన్నబాబు. ముందు తుపాకీలు తయారు చేసి తరువాత విక్రయానికి ప్రయత్నిద్ధామని అనుకున్నానని, ఇంతలో పోలీసులకు పట్టుబడ్డానని చెప్తున్నారు. అయితే కన్నబాబు తయారు చేసిన తుపాకులు కేవలం వన్యప్రాణుల వేటకు మాత్రమే ఉపయోగిస్తారని, అందుకోసమే ఈ తుపాకుల తయారు చేస్తున్నాడని అంటున్నారు పోలీసులు. ఏది ఏదైనా తుపాకీల తయారీ జిల్లాలో సంచలనం రేపింది.