మునిసిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 27 వ తేదీ నుండి తలపెట్టిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధానకార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బారాయుడు పిలుపు ఇచ్చారు. సమ్మె ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.సుబ్బారాయుడు శనివారం వేకువ జామున తాడేపల్లిగూడెం వచ్చారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు డివిజన్ మస్తరు పాయింట్ల వద్ద జరిగిన కార్మికుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సమానపనికి సమానవేతనం, నెలకు 26 వేల కనీస వేతనం , కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయడం, అన్నికేటగరీల కార్మికులకు మెడికల్ అలవెన్స్ చెల్లింపు, సరెండర్ లీవు చెల్లింపు, గ్రాట్యుటీ , పి.ఎఫ్. ఖాతాల క్రమబద్దం వంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జే.ఏ.సి. తరపున సమ్మె నోటీసు ఇచ్చామని, ఇటీవల ఉన్నతాధికారులతో జరిగిన చర్చలలో సమస్యలకు తగిన పరిష్కారం రాలేదని సుబ్బారాయుడు, వివరించారు. అధికారులు గతంలో నోటిమాట హామీలు ఇచ్చినా వాటిని అమలు జరపడం లేదని సుబ్బారాయుడు అన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదని , మాట తప్పనని చెప్పే జగన్ మునిసిపల్ కార్మికుల విషయంలో మాత్రం మాట తప్పారని సుబ్బారాయుడు అన్నారు. అందుకే సమ్మెకు దిగుతున్నామని స్పష్టం చేశారు. ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ సమస్యలపై కార్మిక ఉద్యోగ సంఘాలు ఇచ్చే వినతులు తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి ఏనాడూ ముందుకు రాలేదని , సమస్యల పరిష్కారం కోసం సంఘాలతో సంప్రదించే సంప్రదాయాన్ని ఆయన పక్కనబెట్టి, తనకు తోచిన పద్దతుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వచ్చారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులపై ఎంతో ప్రేమ ఒలకబోసిన ముఖ్యమంత్రి వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోక పోవడం వల్లనే సమ్మెకు దిగాల్సి వస్తున్నదని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ లిఖిత పూర్వకంగా సర్క్యులర్లు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని , సమ్మెను విజయవంతం చేయాలని డి. సోమసుందర్ కోరారు. ఏ.ఐ.టి.యు.సి. ఏరియా కార్యదర్శి ఓసూరి వీర్రాజు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ సాచివేత వైఖరి వల్లనే కార్మికులు పోరాటాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అంగన్ వాడి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.