chali-corona
ఆంధ్రప్రదేశ్

ఓ వైపు కరోనా… మరో వైపు చలి

తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాత్రి రాష్ట్రంలో 19 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లోని జైనథ్‌లో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్‌లో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడి అన్ని జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యయి. రాబోయే మూడు రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ రిపోర్టులో తేలింది. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.మొత్తం 989 పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్‌గా తేలిందిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు తాజాగా హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లో 9, కరీంనగర్‌లో ఒక్క కేసు నమోదు అయింది. ఇక కోవిడ్‌ 19 నుంచి 24 గంటల వ్యవధిలో ఒకరు కోలుకోగా, మరో 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొన్నారు. మరో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నా అధికారులు ఊరటనిచ్చే వార్తను తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. జేఎన్ 1 సబ్‌వేరియంట్‌ కేసులు నమోదు కాలేదని డైరెక్టర్‌ ఆఫ్ హెల్త్‌ రవీంద్ర నాయక్‌ తెలిపారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. అయితే అప్రమత్తంగా మాత్రం ఉండాలని సూచించారు. పెరుగుతున్న జ్వరం, జలుబు, దగ్గు కేసులతో జాగ్రత్తగా ఉండాల్సి అవసరం ఉందన్నారు.