సన్‌బర్న్..! పేరుకు తగ్గట్టే ఇది ఫారెన్ ఫెస్టివల్. పాశ్యాత్య సంస్కృతిని తొందరగా అందిపుచ్చుకునే భారత్‌లోకి కూడా సన్‌బర్న్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సన్‌బర్న్ షో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద షో. పెద్ద పెద్ద సౌండ్స్‌తో హుషారెత్తించే పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు పార్టీ లవర్స్. పూనకాలు వచ్చినట్టు అందరూ ఊగిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇదో మ్యూజికల్ డ్యాన్స్ ఫెస్టివల్.2007లో గోవాలో ఎంట్రీ ఇచ్చిన సన్‌బర్న్ ఈవెంట్‌కి.. నెమ్మదిగా క్రేజ్ రెట్టింపైంది. టాప్ ఈవెంట్ కావడం.. ఇండియాలో కేవలం గోవాలో మాత్రమే.. అది కూడా ఏడాదికి మూడు రోజులే జరుగుతుండటంతో వేల మంది ఈ ఈవెంట్‌కి వెళ్లడం స్టార్ట్ చేశారు. ఏటా ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు పార్టీ లవర్స్. ఈవెంట్‌లో ఫుడ్, డ్రింక్స్ కూడా వెరీ స్పెషల్. ఫుడ్ అండ్ డ్రింక్ స్టాల్స్‌తో పాటు షాపింగ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తుండటంతో ఆల్ ఎట్ వన్ స్టాప్ అన్నట్టుగా మారింది. రాను రానూ క్రేజ్ రెట్టింపవుతూ వచ్చింది.విదేశాల్లో జరిగిన సన్‌బర్న్ ఈవెంట్ ఎలా ఉన్నా.. ఇండియాలో జరిగిన ఈవెంట్‌తో సన్‌బర్న్ రూపురేఖలు మారిపోయాయి.
అసలే గోవా..! ఇష్టారాజ్య సంస్కృతి. డ్రగ్స్, అమ్మాయిలు, విదేశీ లిక్కర్, దేనికీ ఢోకా ఉండదు అక్కడ. ఇంకేం… రెచ్చిపోయారు ఈవెంట్ నిర్వాహకులు. బిగ్గెస్ట్ మ్యూజికల్ ఫెస్టివల్‌కి రిఫ్రెష్మెంట్ పేరుతో డ్రగ్స్, సెక్స్, న్యూడిటీ యాడ్ చేశారు. మరింత పాపులర్ అయ్యింది. ఈవెంట్ ఎంట్రీ పాసుల కోసం ఏడాది కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంట్రీ పాసుల ధరలు కూడా లక్ష రూపాయలకు పైనే చేరింది. దీంతో.. బడాబాబులు మాత్రం వెళ్లడం స్టార్ట్ చేశారు. సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని రాష్ట్రాల సెలబ్రిటీలు.. తమ రాష్ట్రంలో దొరకని ప్రైవసీని గోవా సన్‌బర్న్‌లో వెతుక్కున్నారు.2007 నుంచి 2015 వరకు తిరుగులేకుండా జరిగిన సన్‌బర్న్ ఈవెంట్‌కి అడ్డంకులు ఎదురయ్యాయి. 2016లో గోవా ప్రభుత్వం సన్‌బర్న్ షోకి అనుమతులు రద్దు చేసింది. సన్‌బర్న్ ఈవెంట్ జరగకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2016, 2017లో పూణె వేదికగా సన్‌బర్న్ జరిగింది. ఇక్కడా.. ఇదే ధోరణి. శివసేనతోపాటు కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవడంతో సన్‌బర్న్ ఇక్కడా నిలిచిపోయింది. గోవాలో ప్రభుత్వం మారడంతో 2019లో తిరిగి గోవాకు అడ్డా మార్చింది.
అయితే.. 2017లో పూణెతో పాటు హైదరాబాద్‌లో కూడా సన్‌బర్న్ నిర్వహించారు.2017లో గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన సన్‌బర్న్ షోకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటికే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సన్‌బర్న్ షోకి అనుమతులు ఎలా ఇస్తారని కాంగ్రెస్ నాయకులు గచ్చిబౌలి స్టేడియం ఎదుట, సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఇదే ఈవెంట్‌కి ఓ వ్యక్తి గన్‌తో రావడం పెద్ద కలకలం రేపింది. చెకింగ్ పాయింట్‌లో గుర్తించిన పోలీసులు.. తుపాకీతో పాటు తుపాకీ క్యారీ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.
2019లో మాదాపూర్ నోవాటెల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సన్‌బర్న్ ఈవెంట్‌లోనూ పెద్ద రచ్చ అయ్యింది. బీజేపీ, బజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నేతలు హోటల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. హోటల్‌పై రాళ్లు రువ్వారు. పెద్ద దుమారమే రేపింది.2022 నవంబర్‌లోనూ శంషాబాద్ జీఎంఆర్ అరేనాలో సన్‌బర్న్ ఈవెంట్ జరిగింది. ఇక్కడా… ఇదే రచ్చ. కాంగ్రెస్ నేతలు అడ్డుకునేందుకు వెళ్లారు. ఈ ఈవెంట్‌లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పెద్ద కలకలం సృష్టించింది. అయితే.. తాజాగా మరోసారి సన్‌బర్న్ ఈవెంట్ పెద్ద దుమారం రేపుతోంది. సీఎం రేవంత్.. సన్‌బర్న్ విషయంలో సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో సన్‌బర్న్ ఈవెంట్‌కు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్‌ని పిలిచి విచారించారు సైబరాబాద్ సీపీ.2007లో శైలేంద్ర సింగ్ స్టార్ట్ చేసిన సన్‌బర్న్ రూపురేఖలే మారిపోయాయి. గోవా వెగటార్ బీచ్ వేదికా.. అరేబియా సముద్రం అంచున… అద్భుతమైన సూర్యాస్తమయ సమయంలో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటే ఆ మజానే వేరు. అలాంటి ఈవెంట్.. ఇప్పుడు అడ్డదారులు తొక్కింది. ఇప్పుడు సన్‌బర్న్ అంటేనే… అశ్లీలం, సెక్స్, డ్రగ్స్, గంజాయి..!