బాలానగర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ.. బాలానగర్ ఫ్లై ఓవర్‌కు బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్‌గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్ ఘన నివాళులర్పించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్ఆర్డీపీ ( వ్యూహాత్మక రోడ్ల అభివృద్ది ప్రణాళిక) ద్వారా.. ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్నాం. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో రూ. వెయ్యి కోట్ల పై చిలుకు డబ్బులతో రహదారుల విస్తరణ, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం జరిగింది. హైదరాబాద్ ప్రజలకు మరింత మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను అందిస్తామన్నారు. రవాణా వ్యవస్థను సులభతరం చేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంయుక్తంగా కలిసి బ్రహ్మాండమైన అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. బాలానగర్ పరిధిలో రహదారుల విస్తరణ కూడా చేపడుతామన్నారు. ఫతే నగర్ బ్రిడ్జి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అని తెలిపారు.