anganwadi
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

సమ్మె విరమించి విధుల్లో చేరండి

పసిపిల్లలు, గర్భిణీలు, బాలింతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీలు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 19 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం డిప్యూటీ సీఎం కొట్టును క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు, అంగన్వాడీలకు గత నాలుగున్నర ఏళ్లలో వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోజనాలను సమగ్రంగా వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక సమస్యలను పరిష్కరిస్తూ జీవోలు కూడా జారీ చేసిందని మంత్రి కొట్టు స్పష్టం చేశారు. మిగిలిన సమస్యలు కొన్ని కేంద్రం పరిధిలో ఉన్నాయన్నారు.

అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో ఎంతో ఉదార స్వభావంతో అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా పసిపిల్లలు, గర్భిణీలు, బాలింతలు సంక్షేమం ముడిపడి ఉన్నందున అంగన్వాడీలు దానిని దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా స్పందించాలని మంత్రి కొట్టు విజ్ఞప్తి చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లలకు వేల కోట్లు ఖర్చుపెట్టి పౌష్టికాహారాన్ని అందిస్తుందన్నారు. దానిని అందించకుండా అంగన్వాడీలు ఎవరో ఉచ్చులో పడి మొండి వైఖరితో వ్యవహరించడం సమంజసం కాదని ఆయన సూచించారు. అంగన్వాడీల సమస్యలను తాను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మీ సమస్యలను క్యాబినెట్ దృష్టికి కూడా తీసుకువెళ్తానని డిప్యూటీ సీఎం కొట్టు అంగన్వాడీలకు హామీ ఇవ్వడంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు.

మీ డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని వాటి పరిష్కారానికి సీఎం జగన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మీరు మాత్రం ఎవరో ఉచ్చులో పడి వారి మాటలు విని వ్యవహారాన్ని తెగేవరకు లాగవద్దని మంత్రి కొట్టు సూచించారు. జీతాలు పెంచితేనే సమ్మె విరమిస్తామని మంకు పట్టు పట్టవద్దని తెలియజేశారు.  అంగన్వాడీల సమ్మె వల్ల పసిపిల్లలు, గర్భిణీలు, బాలింతలకు జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. దయచేసి పసిపిల్లల ఉసురు పోసుకోవద్దని, గర్భిణీలు, బాలింతలను ఇబ్బంది పెట్టవద్దని, అలా చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వారి సంక్షేమం దృష్టిలో పెట్టుకుని అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని తెలియజేశారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ సోదరీమణులు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.