ycp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వైసీపీ జాబితా టెన్షన్.. ఇంకా ఉంది

వైఎస్ఆర్‌సీపీలో అభ్యర్థుల కసరత్తు జరుగుతోంది. డిసెంబర్ 31లోపు 50 మంది ఇంచార్జుల మార్పుతో  రెండో జాబితా వస్తుందని వారంతా.. ఒకటో తేదీ నుంచి పెన్షన్ కానుక పంపిణీతో ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభిస్తారని నాలుగు రోజులుగా చెబుతున్నారు.  కానీ ఆ జాబితా మాత్రం విడుదల కాలేదు సరి కదా.. మెల్లగా పాత అభ్యర్థులకే టిక్కెట్లు ఖరారు చేస్తున్నట్లుగా సమాచారం ఇస్తున్నారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దన్న సంకేతాలు పంపుతున్నారు. దీంతో  వైఎస్ఆర్‌సీపీలో మళ్లీ యూటర్న్ నిర్ణయాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. అభ్యర్థుల మార్పుపై సీఎం జగన్ పునారాలోచిస్తున్నారని.. మారుతున్న రాజకీయంతో పాటే వ్యూహాలను కూడా మార్చుకోవాలనుకుంటున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి షర్మిల అధ్యక్షురాలు కావడం ఖాయమన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఇటీవల ఏపీ కాంగ్రెస్ నేతలందర్నీ పిలిపించుకున్న హైకమాండ్ దాదాపుగా ఇదే సందేశాన్ని ఇచ్చింది. ఇక  లాంఛనంగా  షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ బాధ్యతలను తీసుకోవడమే మిగిలింది.

అప్పుడే షర్మిల  వల్ల ఎవరికి నష్టం అన్నదానపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఎవరికి నష్టమో.. ఆ పార్టీ అగ్రనేతలకు బాగా తెలుసు.  అందుకే షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి కడప నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తానని సంకేతాలు పంపుతున్నారు. అదే సమయంలో క్రిస్మస్ పండుగకు టీడీపీ ముఖ్య నేతలకు ఎప్పుడూ లేని విధంగా గిఫ్ట్‌లు పంపారు. ఇవన్నీ రాజకీయంగా వ్యూహాత్మకంగా జరుగుతున్న పరిణామాలే. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే. దళిత, మైనార్టీల్లో ఓ పది శాతం మంది కాంగ్రెస్ వైపు మళ్లినా అది ఎవరికి డ్యామేజ్ జరుగుతుందనేదానిపై రాజకీయవర్గాలకు భిన్నాభిప్రాయాలు లేవు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత కూడా ఉండదు.  టిక్కెట్ రాదని తెలిసి వైసీపీకి గుడ్ బై చెప్పేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాను షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక ఖాయమని ఆయన నిర్ధారణకు రావడంతోనే ఈ ప్రకటన చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక  జగన్మోహన్ రెడ్డి టిక్కెట్లు నిరాకరిస్తున్న వారిలో ఎక్కువ మంది వైసీపీలో ఉండే అవకాశం లేదు. ఎందుకంేట.. టిక్కెట్లు పొందే  నేతలు తమను రాజకీయంగా నిర్వీర్యం చేయాలని అనుకుంటారు. పార్టీని వీడటం తప్ప మరో మార్గం లేదు. వీరందరికీ టీడీపీ, జనసేనల్లో చాన్స్ దొరకదు. కానీ షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీలో చోటు దొరుకుంది. అంటే .. బలమైన అభ్యర్థుల కొరత కూడా తీరుతుంది. ఇలాంటి వారంతా  వైసీపీ క్యాడర్ ను తీసుకుని కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు. ఇంచార్జుల్ని  మార్చే విషయంలో సీఎం జగన్ ముందు ఈ అతి పెద్ద సమస్య వచ్చి పడింది.వైసీపీ పై సీఎం జగన్‌కు పూర్తి స్థాయిలో పట్టు ఉందని ఎక్కువ మంది నమ్ముతారు. ఆయన చెప్పిందే వేదం అని భావిస్తారు. అదే నిజం కూడా. కానీ అధికారంలో ఉండే ఏ పార్టీ అధ్యక్షుడికైనా ఆ పవర్ ఉంటుంది. ఎన్నికలకు ముందు.. పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్న ప్రచారం ఉన్నప్పుడు తమ డిమాండ్లపై ఏ మాత్రం తేడా వచ్చినా.. ధిక్కారం వినిపిస్తారు. అలాంటివి ఇప్పుడు  వైఎస్ఆర్‌సీపీలో ఎక్కువగా  వినిపిస్తున్నాయి.  

జగన్ తరపున వైఎస్ఆర్‌సీపీ వ్యవహారాలను చక్కబెట్టే టాప్ ఫోర్ నాయకుల్లో ఒకరు అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన తిరుగుబాటు దీనికి నిదర్శనం.  ఉత్తరాంధ్ర నుంచి అవకాశం రాని నేతలంతా అదే బాటలో ఉండనున్నారు. చివరికి రాయలసీమ నుంచి కూడా ధిక్కారం వినిపించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారధి సీఎం జగన్ తనను నమ్మలేదంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.  రాజకీయ పార్టీల్లో ఒక్క సారి అంటుకుంటే.. అది దావాలనం అవుతుంది.ఎదురుగా షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే.. ఇక కట్టు తెగిపోతుందన్న అంచనాలు వస్తాయి. ఇది వైసీపీ అగ్రనాయకత్వాన్ని వెనక్కి లాగుతున్న రెండో అంశ?టీడీపీ – జనసేన పొత్తులు పెట్టుకోవడంతో ఏపీ రాజకీయ సెంటిమెంట్ చాలా వరకూ మారిపోయింది. పవన్ కల్యాణ్ ను పదే పదే టార్గెట్ చేసి ఆయనను టీడీపీతో కలిసేలా పరిస్థితులు కల్పించింది వైసీపీ నాయకులేనన్న సెటైర్లు ఉన్నాయి. అసలు  కలిసిపోయిన తర్వాత దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయమనే సవాళ్లను చేస్తున్నారు. ఇలాంటివి రాజకీయాల్లో.. వేరే అర్థాలకు కారణం అవుతాయి.

ఇప్పుడు బీజేపీ కూడా వైసీపీకి వ్యతిరేక కూటమిలో చేరనుందేన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ .. వైసీపీ వ్యతిరేక కూటమిలో ఉంటే తమకు ఎంత నష్టం జరుగుతుందో వైసీపీ పెద్దలకు బాగా తెలుసు. గత ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు లేకపోయినా.. టీడీపీని ఓడించడానికి బీజేపీ కావాల్సిన సహకారం అందించింది. అందుకే చంద్రబాబు పదవి కాలం ముగియక ముందే .. ఈసీ ద్వారా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎస్‌గా నియమించుకుని రెండు నెలల ముందుగానే పాలనను పరోక్షంగా తమ చేతుల్లోకి తెచ్చుకోగలిగారు. ఈ సారి బీజేపీ  టీడీపీ, జనేసన కూటమికి సహకరిస్తే.. అంత కంటే ఘోరమైన పరిస్థితి వైసీపీకి ఎదురయ్యే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రాజకీయ పరిణామాలన్నింటినీ విశ్లేషించుకున్న వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ఇంచార్జులు మార్పు అనే వ్యూహంపై వెనక్కి తగ్గాని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ ను మార్చేస్తామని ముందుగా నిర్ణయించారు. వేరే చోట నుంచి పోటీ చేయాలని సూచించారు. కానీ ఆయన  తాను అసలు పోటీ చేయనని  చెప్పి వెళ్లిపోయారు.సీఎంవో పిలిచినా రాలేదు. కానీ మళ్లీ మైలవరంలోనే పోటీ చేసేందుకు చాన్సిస్తామని చెబితేనే వచ్చారు.

ఇప్పుడు ఆయనకే టిక్కెట్ ఖరారు  చేశారు. అలాగే బాలినేని శ్రీనివాస రెడ్డి , రోజా , అంబటి రాంబాబు సహా కీలక నేతలందరి పేర్లు మార్పు జాబితాలోకి వచ్చినా మళ్లీ తప్పించారు  ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో నియోజకవర్గాలను మార్చారు. ఇందులో అటూ ఇటూ తిప్పిన వారు కాకండా నికరంగా ముగ్గురికే టిక్కెట్ నిరాకరించారు. ఇక మహా అయితే మరో పది మందికి మాత్రమే టిక్కెట్ నిరాకరిస్తారని.. సిట్టింగ్‌లకే చాన్సిస్తారని వైసీపీ వర్గాలు ప్రచారం ప్రారంభించాయి. మొత్తంగా కసరత్తు పేరుతో వైసీపీలో చిచ్చు పెట్టుకోవడం తప్ప.. పెద్దగా మార్పులేమీ ఉండవని వైసీపీ వర్గాలు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నాయి.