cong-ycp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

కాంగ్రెస్ లోకి వైసీపీ అలక ఎమ్మెల్యేలు

ఏపీ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ పెట్టారా? వైసీపీ అలక ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్పించేలా కసరత్తు చేస్తున్నారా? అందుకోసం రేవంత్ దూత ఒకరు అలక ఎమ్మె్ల్యేలకు టచ్‌లో ఉన్నారా? కాంగ్రెస్‌లో చేరితే హైదరాబాద్‌లో మీ ఆస్తులు పదిలం.. మీరు కాంగ్రెస్‌లో చేరితే మీ వ్యాపారాలకు సహకరిస్తామంటూ నేతలను వలలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్లాన్ సక్సెస్ అయితే వైసీపీ ఓట్లు చీలి టీడీపీకి లాభం చేకూరనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో తన మార్కును చూపించుకునేందుకు, కనీసం 40 మంది అలక ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్పించి తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుండడం వైసీపీ నేతలను ఇరకాటంలో పడేసింది. అలక నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ముందే రాజకీయ వేడి మొదలైంది. రాష్ర్ట విభజన నాటి నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాల్లేకుండా పోగా.. తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి రూపంలో పుంజుకుంది.

అదే ఒరవడిని ఏపీలో తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ర్టాల్లో తన మార్కును చూపించుకునేందుకు తెలంగాణ సీఎం కసరత్తు చేస్తున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రోజుకో కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ అభ్యర్థులను మార్చే పనిలో ఉండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో దాదాపు 40 మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.అందు కోసం ఆయన తన దూతను అలక ఎమ్మె్ల్యేలపై ఫోకస్ చేయాలని ఆదేశాలివ్వడంతో ఆ దూత అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తను అనుకున్నది అనుకున్నట్లు జరగాలని, జరుగుతుందని నమ్మే కొద్ది మందిలో జగన్ ఒకరు. ఆయన 70 మంది అభ్యర్థులను మార్చడమో తీసేయడమో చేస్తున్నారు. అయితే జగన్ కొత్తవారిని పెట్టి గెలిపిద్దామనుకుంటే రేవంత్‌రెడ్డి జగన్‌కు భారీ షాకిచ్చారు. ఏపీలో ఏ పార్టీ ఎమ్మెల్యేకైనా తెలంగాణలో ఆస్తులు, వ్యాపారాలు ఉంటాయన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జగన్ మార్చిన ఎమ్మెల్యేలతో రేవంత్ దూత ఒకరు వివరాలు సేకరిస్తున్నారు. వారిని హైదరాబాద్‌లో మీ వ్యాపారాలకు సహకరిస్తాం.. కాంగ్రెస్‌లో చేరండి.. ఎలాగో 2024లో మోడీకి సీట్లు తగ్గుతాయి.. 2029లో కచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. మీరు కాంగ్రెస్‌లో చేరితో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి వారిని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుండడం వైసీపీని ఇరకాటంలో పడేసింది. చాలా మంది వైసీపీ అలక ఎమ్మె్ల్యేలు రేవంత్ దూతకు సమ్మతం తెలుపుతున్నట్లు సమాచారం. వాస్తవానికి జగన్ వదిలేసిన ఎమ్మెల్యేలకు ఇది బంపరాఫర్ అనే చెప్పాలి. ఎందుకంటే దీర్ఘకాలంగా చూసుకుంటే రేవంత్ సరసన చేరడమే వారికి ఎక్కువ ఉపయోగం. కాబట్టి చాలామంది రేవంత్ దూతకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణ సీఎం ప్లాన్ సక్సెస్ అయితే మాత్రం ఏపీ వైసీపీలో భారీ స్థాయిలో ఓట్లు చీలనున్నాయి. దాదాపు 40 మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో టీడీపీకి కలిసి రానుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పరోక్షంగా టీడీపీని గెలిపించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

ఏపీ వైసీపీలో అలక ఎమ్మెల్యేలతో రేవంత్ దూత ఎలాగూ సీటు రానపుడు మీరు ఆ పార్టీలో ఉన్నా ఉపయోగం లేదని, ఈ ఐదేళ్లు మీ వ్యాపారాలు బాగుంటాయని, ఒక వేళ మీకు బలం ఉంటే ఈ ఎన్నికల్లో గెలుస్తారు.. కానీ పార్టీ మీద ఇపుడు జనంలో నెగెటివిటీ లేదు.కాబట్టి కాంగ్రెస్‌లో చేరండి అని రేవంత్ దూత బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైఎస్ షర్మిలకు పార్టీ పగ్గాలు ఇవ్వనున్నారనే వార్తలు విన్పిస్తున్న నేపథ్యంలో ఆమెకూ ఈ ప్లాన్ కలిసి రానుందనే చర్చ సాగుతోంది. మొత్తానికి జగన్ అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అయితే వైసీపీ ఓటు భారీగా చీలి వైసీపీ కుదేలవడం ఖాయంగా కన్పిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా రేవంత్ దూత మాట విని కాంగ్రెస్‌లో చేరితే రేపటి రోజున టీడీపీ అధికారంలోకొచ్చినా తమకు ఏ ప్రమాదం ఉండదని భావిస్తున్నట్లు సమాచారం.