దేశంలో కోట్లాది మందిని పట్టి పీడిస్తున్న వ్యాధి మధుమేహం. ఇటీవల 18 ఏండ్ల లోపు వారూ ఈ వ్యాధిబారిన పడుతున్నారు. ఈ వ్యాధిని గుర్తించాలంటే సూది గుచ్చి శరీరంలోని రక్తాన్ని తీయాలి. ఇది రోగికి బాధ కలిగించే ప్రక్రియ. పైగా కొందరు సూదంటే చాలు భయంతో వణికిపోతారు. అయితే అలా సూది గుచ్చి రక్తం తీయనవసరం లేకుండానే తక్కువ ఖర్చుతో ఒక పరికరాన్ని కనుగొన్నారు ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన శాస్త్రవేత్త పూసా చిరంజీవి శ్రీనివాసరావు.కేవలం చెమట ద్వారా మధుమేహాన్ని నిర్ధారించే ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని కనుగొనగా, దానిని రెండేళ్ల పాటు పరీక్షించిన ఇండియన్ పేటెంట్ అథారిటీ గత నెల 29న పేటెంట్ హక్కులు కల్పించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీనివాసరావు ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివిన ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ, తర్వాత పీహెచ్‌డీ చేసి, ప్రస్తుతం ఐఐటీ కాన్పూర్‌లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు.
శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నిర్ధారించడానికి రక్తాన్ని తీయనవసరం లేకుండా కేవలం చెమటను పరీక్షించి నిమిషంలో ఈ పరికరంతో మధుమేహాన్ని లెక్కించవచ్చని ఆయన తెలిపారు. ఈ పరికరం అందుబాటులోకి వస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, ఖర్చు కూడా తగ్గుతుందని శ్రీనివాసరావు చెప్పారు.