jagan-1
ఆంధ్రప్రదేశ్ జాతీయం

సోషల్ ఇంజనీరింగ్ టార్గెట్

తొలి విడతగా 11 మంది అభ్యర్థులను మార్చారు. సంచలనానికి తెర తీశారు. ఇప్పుడు ఏకంగా 27 మంది అభ్యర్థులను మార్చుతూ రెండో జాబితా విడుదల చేశారు.అయితే అభ్యర్థుల మార్పు వెనుక భారీ కూర్పు,కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది.ఏపీలో పెద్ద ఎత్తున అభ్యర్థులను జగన్ మారుస్తున్నారు. దీంతో వైసీపీలో ఒక రకమైన అలజడి వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడే బాధితులు ధిక్కారస్వరాలు వినిపిస్తున్నారు. అయినా సరే ఎక్కడా జగన్ వెనక్కి తగ్గడం లేదు. మార్పుల విషయంలో వెనుకడుగు వేయడం లేదు. సొంత పార్టీ నేతలతో పాటు విపక్షాలకు జగన్ నిర్ణయాలు అంతు పట్టడం లేదు. ఆయనేదో ప్రయోగం చేస్తున్నారని అనుకోవడానికి వీలు లేదని.. పక్కా వ్యూహంతోనే ముందడుగు వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అభినందిస్తున్నారు.తొలి విడతగా 11 మంది అభ్యర్థులను మార్చారు. సంచలనానికి తెర తీశారు. ఇప్పుడు ఏకంగా 27 మంది అభ్యర్థులను మార్చుతూ రెండో జాబితా విడుదల చేశారు.

అయితే అభ్యర్థుల మార్పు వెనుక భారీ కూర్పు,కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టి, బీసీ,మైనారిటీలకు అత్యధిక స్థానాలు కేటాయించడం గుర్తించాల్సిన అంశం.ఏకంగా ఈ మార్పుల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను ముస్లింలకు కేటాయించడం కూడా పక్క వ్యూహంగా తెలుస్తోంది. సామాజిక సాధికారత దిశగా అడుగులు వేశానని.. ఇక ఆలోచించుకోవాల్సింది ఆయా వర్గాల ప్రజలేనని జగన్ పిలుపునిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.సామాజిక సాధికారత కోసం తన సొంత సామాజిక వర్గాన్ని పక్కన పెట్టడం సాహసంతో కూడుకున్న పనే. మంగళగిరి, కదిరి, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం నేతలను పక్కన పెట్టారు. బీసీలకు అవకాశం కల్పించారు. సామాజిక న్యాయం పేరుతో వారికి పెద్దపీట వేశారు. ఇక్కడ సొంత సామాజిక వర్గం నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నా జగన్ పట్టించుకోకపోవడం విశేషం. విజయవాడ వెస్ట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఓసి అభ్యర్థిగా ఉన్నారు.

అక్కడ ఆయనను మార్చి మైనారిటీ నేత షేక్ ఆసిఫ్ కు నియోజకవర్గ ఇన్చార్జిగా నియామకం వెనుక జగన్ ఆలోచన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.సాధారణంగా విపక్షాలు నిలిపి అభ్యర్థులను చూసి అధికార పార్టీ వ్యూహాలు రూపొందించుకోవాలి. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఏపీ ఆయువుపట్టుగా ఉన్న కులాలను జగన్ టార్గెట్ చేసుకున్నారు. వారికి సీట్లు కేటాయించి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఇప్పుడు జగన్ నిర్ణయం విపక్షాలపై సైతం ప్రభావం చూపుతోంది. అదే సామాజిక సాధికారిత చూపించాల్సిన అనివార్య పరిస్థితి తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పై పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు అదే సముచిత స్థానం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదును చూసి జగన్ సరైన వ్యూహంతోనే ముందుకు కదులుతున్నారు. కానీ ఈ వ్యూహంలో సొంత పార్టీ నేతలు సమిధులుగా మారుతున్నారు. వారు ఎదురు తిరిగి.. ఎన్నికల్లో ప్రత్యర్థులకు సహకరిస్తే జగన్ వ్యూహం తప్పకుండా ఫెయిలవుతుంది. అయితే అవేవీ పట్టించుకోని స్థితిలో జగన్ ఉన్నారు. సామాజిక సాధికారత పైనే పెద్దగా ఫోకస్ పెట్టడం విశేషం.