dk family
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

డీకే ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక పార్టీ

చిత్తూరు జిల్లాలో ఆ ఫ్యామిలీ చుట్టూ పొలిటికల్ డ్రామా నడుస్తోంది. ఆర్థికంగానే కాదు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆ కుటుంబం మూడు పార్టీల వైపు చూస్తోంది. ఇప్పటికే అధికార వైసీపీ, జనసేనతో ఆ ఫ్యామిలీ వారసులు టచ్‎లో ఉండగా టోటల్ ఫ్యామిలీని తెచ్చుకునే ప్రయత్నం టీడీపీ చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. డీకే ఆదికేశవులు ఒకప్పడు దేశ,రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. ఆర్థికంగా బలమైన నేతగా గుర్తింపు ఉన్న డీకే అదికేశవులు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నేపథ్యం ఉన్న నేత. గత కొన్నేళ్లుగా పొలిటికల్‎గా యాక్టివ్ లేని ఈ ఫ్యామిలీ చుట్టూ పొలిటికల్ డ్రామా నడుస్తోంది. పొలిటికల్‎గా యాక్టివ్ అయ్యేందుకు ఈ కుటుంబం చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. డీకే ఫ్యామిలీ కూడా మూడు పార్టీల వైపు చూస్తుండటంతో పొలిటికల్ సర్కిల్స్‎లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇప్పటికే వైసీపీతో కొడుకు డీకే శ్రీనివాస్ టచ్‎లో ఉండగా.. డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య జనసేన కండువాను కప్పుకున్నారు. మరోవైపు ఆర్థిక, సామాజిక బలమున్న డీకే ఆదికేశవులు ఫ్యామిలీని టీడీపీలోకి తెచ్చేందుకు ఆ పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తోంది.

డికే ఫ్యామిలీ చివరకు ఏ పార్టీ జెండా పట్టుకుంటుంది.. వారసులుగా ఎవరు ఎన్నికల బరిలో ఉంటారన్న ఆసక్తి నెలకొంది.బడా పారిశ్రామికవేత్తగా టీడీపీ హయంలో చిత్తూరు ఎంపీగా గెలిచిన డికే ఆదికేశవులు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లోనూ కీలక నేతగా వ్యవహరించారు.2004లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్‎గా పనిచేసిన డికే ఆదికేశవులు చిత్తూరు జిల్లాలో ఆర్థికంగా బలమైన బలిజ సామాజిక వర్గం నేతగా పెద్ద దిక్కుగా ఉన్నారు. ఏఐసీసీ కోశాధికారిగా, సత్యసాయి ట్రస్ట్ కోశాధికారిగా కూడా చక్రం తిప్పారు డీకే ఆదికేశవులు. జేఎంఎం స్కాం సమయంలో అధికారం కోసం ఓటు హక్కును అనుకూలంగా వినియోగించుకున్న డీకే విజయ మాల్యాకు కూడా వ్యాపార భాగస్వామి. ఆయనతో అత్యంత సన్నిహితంగా కూడా మెలిగిన డీకే ఆయన మరణించిన తరువాత కొద్దికాలం పొలిటికల్‎గా ఆ ఫ్యామిలీ కనుమరుగయిందిరాజకీయ వారసత్వం అందుకున్న ఆయన కొడుకు డీకే శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసినా ఫలితం లేకుండా పోయింది. 2009 ఎన్నికల్లో ఓటమితో రాజకీయాలకు దూరంగా ఉన్న డీకే ఫ్యామిలీ.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది.

డీకే అదికేశవులు భార్య డీకే సత్యప్రభ 2014 ఎన్నికల్లో చిత్తూరు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సత్యప్రభ రాజకీయాలకు దూరమై మరణించారు. ఇక అప్పటి నుంచి పొలిటికల్‎గా కనిపించని డీకే ఫ్యామిలీ తిరిగి ఇప్పుడు యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. డీకే ఆదికేశవులు ఫ్యామిలీ నుంచి వారసత్వం ఎవరిదన్న చర్చకు దారితీస్తోంది. డీకే ఆదికేశవులు కొడుకు శ్రీనివాస్ ఇప్పటికే వైసీపీ అధిష్టానంతో టచ్‎లో ఉన్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‎తో కలిసి ఏడాదిన్నర క్రితమే సీఎం జగన్‎తో భేటీ అయ్యారు. అయితే వైసీపీ కార్యకలాపాల్లో డీకే శ్రీనివాస్ ఎక్కడా కనిపించక పోగా ఇప్పుడు డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య జనసేన కండువాతో జనం మధ్యకు వచ్చారు. ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన చైతన్య డికే శ్రీనివాస్‎కు స్వయాన అక్క కూతురు కావడంతో మామ కోడలు చెరొక పార్టీలో ఉన్నట్లు స్పష్టం అయ్యింది. చిత్తూరు నుంచి ఎన్నికల బరిలో ఉంటానన్న ధీమాతో చైతన్య కూడా ఉంది.