two schemes-congres
తెలంగాణ రాజకీయం

త్వరలో మరో రెండు గ్యారంటీలు

తెలంగాణ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్‌. ఈమేరకు మేనిఫెస్టోలో మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసాను గ్యారెంటీలుగా ప్రకటించింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలకు ఆకర్షితులయ్యారు. నవంబర్‌ 30న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. డిసెంబర్‌ 7న కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ముందుగా ప్రకటించినట్లు ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌ దృష్టిపెట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణానికి అనుమతించారు. ఈ రెండు పథకాలు అమలవుతున్నాయి.

ఈ క్రమంలో డిసెంబర్‌ 28 నుంచి ఐదు గ్యారంటీల లబ్ధిదారుల కోసం వారం రోజులపాటు దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. ఇందుకు ప్రజాపాలన పేరుతో సభలు నిర్వహించింది. జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన సభల్లో 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కోటి దరఖాస్తులు ఐదు గ్యారంటీలకు సంబంధించినవి కాగా, 25 లక్షల దరఖాస్తులు రేషన్‌ కార్డులు, ఇతర అంశాలకు సంబంధించినవని ప్రభుత్వం తెలిపింది.దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. ఈ దరఖాస్తులను ఇప్పుడు ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియ నడుస్తుంది. ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే ఆరు గ్యారంటీల్లో మరో రెండు అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించేలా కసరత్తు చేస్తున్నారు.

ఈమేరకు క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెల్ల రేషన్‌కార్డు ఉన్న అందరికీ సబ్సిడీ గ్యాస్, 200 యూనిట్ల విద్యుత్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.