sankranti
ముఖ్యాంశాలు

సంక్రాంతి పండగ ఏ రోజు జరుపుకోవాలి ..

సంక్రాంతి పండగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి అంటుంటారు. ఈ ఏడాది పండగ ఏ తేదీన జరుపుకోవాలనే అంశంపై కన్‌ఫ్యూజ్ నెలకొంది. ఎందుకంటే ఏట జనవరి 14వ తేదీన పండగ జరుపుకుంటారు. ఈ సారి క్యాలెండర్‌లో 15వ తేదీన వచ్చింది. దాంతో జనాలు అయోమయానికి గురవుతున్నారు. పండగ ఏ రోజు జరుపుకోవాలో పండితులు క్లారిటీ ఇచ్చారు
సంక్రాంతి పండగ
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అంటారు. సూర్య భగవానుడు తన కుమారుడు అయిన శనిదేవుని ఇంటికి వస్తాడని పురాణాల్లో ఉంది. దేశంలో కొన్ని చోట్ల సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు. ఒక్కోచోట ఒకలా సంక్రాంతిని పిలుచుకుంటారు. మహారాష్ట్రలో ‘మకర సంక్రాంతి’ అని, పశ్చిమ బెంగాల్‌లో ‘పౌష్ పర్బన్’ అని, తమిళనాడులో ‘పొంగల్’ అని, గుజరాత్‌లో ‘ఉత్తరాయణ్’ అని సంక్రాంతిని పిలుస్తారు. సంక్రాంతి పండగ సమయంలో కొత్త పంటలు ఇంటికి వస్తాయి. కొత్త అల్లుళ్ల రాకతో ఇళ్లు సందడిగా ఉంటాయి. కళ్లాపి చల్లి, గొబ్బెమ్మలు పెట్టి.. రంగు రంగుల హరివిళ్లులతో అందంగా అలంకరిస్తారు. పిల్ల, పెద్దలు అందరూ కలిసి ఉదయాన్నే స్నానం చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. మరికొందరు నదుల్లో పుణ్యస్నానం చేస్తారు. ఇలా చేయడంతో పాపాలు తొలగి, జీవితంలో మంచి కలుగుతుందని విశ్వసిస్తారు. పిండి వంటలు వండుకొని, సందడిగా ఉంటారు. ఆ రోజున పతాంగులు ఎగరవేయడంలో పిల్లలు బిజీగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కోడి పందాలతో తీరిక లేకుండా గడుపుతారు. సంక్రాంతి పండగ అంటే అంతా కలిసి సందడిగా ఉంటుంది.
పండగ ఎప్పుడంటే..?
ఈ ఏడాది సంక్రాంతి 15వ తేదీన జరుపుకోవాలి. ఏటా సూర్యుడి స్థానాన్ని బట్టి సంక్రాంతి 14వ తేదీన వస్తోంది. ఈ సారి లీపు సంవత్సరం రావడంతో అది 15వ తేదీకి మారింది. దృక్ పంచాంగం ప్రకారం సంక్రాంతి పుణ్య కాల సమయం 15వ తేదీ ఉదయం 7.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.46 గంటలకు ముగియనుంది. ఉదయం 7.15 గంటలకు మహా పుణ్య కాలం ప్రారంభమై ఉదయం 9 గంటలకు ముగియనుంది.
పూజ ఎప్పుడు చేయాలి..?
ప్రాంతాన్ని బట్టి పూజ సమయం మారుతోంది. సూర్యోదయం అయిన తర్వాత పూజలు చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉదయమే పూజ కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సమయం ఉండటంతో 8 గంటల నుంచి పూజలు చేసుకునే వీలు ఉంటుంది. ఉత్తరప్రదేశ్, బీహర్ రాష్ట్రాల్లో రోజంతా ఏదో ఒక సమయంలో పూజ కార్యక్రమాలు చేసుకుంటారు. మహారాష్ట్ర, గుజరాత్‌లో మాత్రం మద్యాహ్నాం పూట గాలిపటాలు ఎగరవేస్తుంటారు.
పిండి వంటలు
సంక్రాంతి రోజున పిండి వంటలు చాలా చేస్తుంటారు. తెలంగాణలో సకినాలు ఫేమస్. ఆంధ్రాలో పిండి వంటలు స్పెషల్. నువ్వులు, బెల్లంతో మిఠాయి, కిచిడీ కూడా చేస్తుంటారు. తెలంగాణలో కొన్నిచోట్ల సంక్రాంతి రోజున కొందరు నాన్ వెజ్ వండుకుంటారు. ఇతర చోట్ల సంక్రాంతి తెల్లవారి కనుమ రోజున నాన్ వెజ్ స్పెషల్ వంటలు ఉంటాయి.