తిరుపతి జిల్లాలో దొంగ ఓట్ల రాజకీయం ఆసక్తికరంగా మారింది. తిరుపతి, చంద్రగిరిలో లక్షలాదిగా దొంగ ఓట్లు ఉన్నాయన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపణలపై సవాళ్ల పర్వం కొనసాగుతోంది. దొంగ ఓట్లు తొలగించాలంటూ టీడీపీ ఆందోళనలు చేస్తుంటే, ఆధారాలు లేకుండా ఓటు తొలగించాలంటున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటున్నారు వైసీపీ నేతలు.. ఒకరిపై మరొకరు పిర్యాదులతో నమోదైన కేసులు తిరుపతి జిల్లా పాలిటిక్స్ లో హీట్ ను పెంచాయి.2024 సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడన్న స్పష్టత రాకముందే తిరుపతి జిల్లాలో దొంగ ఓట్ల వ్యవహారం తారాస్థాయి కి చేరింది. ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు దొంగ ఓట్లపై చేసిన ఫిర్యాదులు ఆరోపణలు తిరుపతి జిల్లాలో చర్చగా మారాయి. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు లక్షల్లో ఉన్నాయన్న చంద్రబాబు ఆరోపణలు రాజకీయ సవాళ్లకు కారణం అయ్యింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు ఉన్నాయని చేసిన కామెంట్స్ కు వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఇందులో భాగంగానే ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు చంద్రగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించడం తగదంటూ ఆధారాలు చూపే ప్రయత్నం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో 2,91,734 ఓట్లు ఉంటే ఇప్పుడు 3,08,672 ఓట్లు ఉన్నాయన్నారు. 5 ఏళ్ల పెరిగిన ఓట్లు దాదాపు 16వేలు ఓట్లు మాత్రమేన్నారు. చంద్రబాబు ఆరోపించినట్లు లక్ష దొంగ ఓట్లు ఉంటే 3,91, 734 ఉండాలన్నారు. మరి చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో 3,08,672 ఓట్లు మాత్రమే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించిన చంద్రగిరి వైసీపీ అభ్యర్థి మోహిత్ చంద్రబాబు ఆరోపణలపై న్యాయపోరాటం చేస్తామన్నారు.చంద్రబాబు తాత సమానులని అలాంటి వ్యక్తి వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధాలు మాట్లాడడం బాధ కలిగిస్తుందన్నారు. గతేడాది నవంబర్ లో కేవలం 4 రోజుల్లోనే టీడీపీకి చెందినవారు 14,200 ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేశారన్నారు.
ఓట్ల తొలగింపుకు సూత్రధారులు పై కేసులు నమోదు చేయాలని ఇప్పటికే పలు పిఎస్ లో వైసీపీ ఫిర్యాదులు కూడా చేసిందన్నారు. అసత్య ఆరోపణలు, ఇప్పుడు సమాచారంతో ఫారం 7 పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి, చంద్రగిరి అసెంబ్లీ పరిధిలోని 6 పోలీసు స్టేషన్ లలో పిర్యాదులు కూడా చేసామన్నారు అంతేకాదు చంద్రగిరి దొంగ ఓట్లపై చంద్రబాబు చేసిన ఆరోపణలను రుజువు చేస్తే రాబోయే ఎన్నికల్లో నామినేషన్ కూడా వెయ్యబోనని టీడీపీకి సవాల్ విసిరారు మోహిత్. వాస్తవాలు తెలుసుకోకుండా లక్ష దొంగ ఓట్లు ఉన్నాయని పిర్యాదు చేసిన చంద్రబాబు చేయగలరా అని ప్రశ్నించారు మోహిత్.మరో వైపు దొంగ ఓట్లు తొలగింపు, దొంగ ఓటర్ల నమోదులో సూత్రధారులైన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంది.
రెండు రోజుల క్రితం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు చంద్రగిరి టీడీపీ ఇన్చార్జ్ పులివర్తి నాని చేపట్టిన దీక్ష ఉద్రిక్తతకు దారి తీయగా టీడీపీ జనసే ల పోరాటం కొనసాగుతోంది. ముసాయిదా ఓటరు జాబితాలో గందరగోళంగా ఉన్న మార్పులు చేర్పులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు ఆధార్ తో అనుసంధానం చేసి సమస్యకు తెరదించాలని డిమాండ్ చేస్తున్నారు.