ఏపీలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పై సస్పెన్స్ కొనసాగుతోంది.దీనిపై పెద్ద ఎత్తున అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే మారిన పరిణామాలు నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం తెలంగాణలో అమలవుతోంది. అయితే ఈ పథకంతో ఏపీఎస్ఆర్టీసీకి అనూహ్యంగా ఆదాయం పెరగడం విశేషం. అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఏపీఎస్ఆర్టీసీ సద్వినియోగం చేసుకుంటోంది. ప్రస్తుతానికి ఈ ఉచిత ప్రయాణం పథకాన్ని ఏపీ ప్రభుత్వం పక్కన పడేసినట్లు తెలుస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించింది. గత నెల రోజులుగా ఈ పథకం అమలవుతోంది. మహిళల నుంచి భారీ ఎత్తున ఆదరణ లభిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ ఉచిత ప్రయాణం హామీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. చంద్రబాబు సైతం తమ మేనిఫెస్టోలో ఈ పథకాన్ని పెట్టనున్నట్లు ప్రకటించారు. అయితే అంతకంటే ముందే అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు. అధికారుల సైతం వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పథకం అమలు చేస్తే ఏపీఎస్ఆర్టీసీ పై పడే భారం, ఇతరత్రా అంశాలను పరిశీలిస్తున్నారు.
లోతుగా అధ్యయనం చేసి పథకానికి ఒక రూపురేఖలు తేవాలని చూస్తున్నారు.సరిగ్గా ఇటువంటి సమయంలో సంక్రాంతి ముంచుకొస్తోంది. సాధారణంగా హైదరాబాదులో నివాసముండే ఏపీ ప్రజలు సంక్రాంతికి సొంత గ్రామాలకు రావడం ఆనవాయితీగా వస్తోంది. బస్సులు, రైళ్లు రద్దీగా ఉంటాయి ఈ సమయంలో. ఏపీవ్యాప్తంగా 6795 బస్సులను సంక్రాంతి స్పెషల్ గా నడుపుతున్నారు. ఇందులో ఒక్క హైదరాబాదుకి 1600 సర్వీసులను ఏర్పాటు చేశారు. ఇదే స్థాయిలో తెలంగాణ ఆర్టీసీ సైతం ఏపీకి ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. అయితే అనూహ్యంగా ఏపీ బస్సులకు ముందస్తు రిజర్వేషన్లు పూర్తయ్యాయి.అయితే తెలంగాణ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో రద్దీ పెరిగింది. అందుకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. దీంతో ఏపీ సంక్రాంతి స్పెషల్ బస్సులు తగ్గాయి. ఈ విషయాన్ని గమనించిన ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అదనంగా 1400 బస్సులను ఏర్పాటు చేయడం విశేషం.
ఏపీలోని 13 జిల్లాల్లో తిరిగే సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను సైతం హైదరాబాద్ వరకు ఏర్పాటు చేశారు. ఈ లెక్కన 3000 బస్సులను నడుపుతున్నారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీకి ఆదాయం పెరగడంతో పాటు ఏపీకి వచ్చే వారికి ప్రయాణం సుగమంగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో మహాలక్ష్మి పథకం.. సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీకి వరంగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఉచిత ప్రయాణ నిర్ణయాన్ని వాయిదా వేసింది.