nirmala sitaraman
జాతీయం రాజకీయం

ఫిబ్రవరి 1న బడ్జెట్…

ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు. జనవరి 31వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. మహిళా రైతులకు పీఎం కిసాన్ సమ్మతి నిధి కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేయనున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడం వల్ల ఆసక్తి మరింత పెరిగింది. అయితే..ఈ సారి మహిళా రైతులకు కేంద్ర శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన పద్దు ప్రవేశపెట్టినప్పుడే ఈ విషయంలో స్పష్టత రానుంది. మహిళా రైతులకు కిసాన్ సమ్మాన్‌ నిధి కింద అందించే కేటాయింపులను రూ.12000 వేల కోట్లకు పెంచనున్నట్టు సమాచారం.

మధ్యంతర బడ్జెట్‌లో ఈ మేరకు కేటాయింపులు జరిగితే…మహిళా రైతులను ప్రోత్సహించినట్టవుతుందని కేంద్రం భావిస్తోంది. పైగా…ఈ లబ్ధి పొందితే ఆ మహిళలంతా బీజేపీవైపే మొగ్గు చూపే అవకాశముంటుంది. దీంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్రం కేటాయింపులను మరింత పెంచనున్నట్టు తెలుస్తోంది. 2047 నాటికి భారత్‌ని 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఇప్పటికే నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక ఆదాయపు పన్ను విషయంలో పెద్దగా ఏమీ మార్పులు ఉండకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.