mudragada
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

కిర్లంపూడికి నేతల క్యూ

కాకినాడ జిల్లా కిర్లంపూడిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ లేదా జనసేనలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరే అవకాశం ఉందనే వార్తలు రావడంతో అధికార వైసీపీ అలర్ట్ అయ్యింది. ముద్రగడను బుజ్జగించేందుకు వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే వైసీపీ కీలక నేత ఒకరు ముద్రగడతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
వైసీపీలో చేరాలని కోరినట్లు సమాచారం. ఇక కాపు నేతగా పేరున్న తోట త్రిమూర్తులును రంగంలోకి దింపింది వైసీపీ. ముద్రగడ ఇంటికి ఆయన వెళ్లనున్నారు. అయితే, అధికార పార్టీ వైసీపీ వైపు చూసే ప్రసక్తే లేదని తన అనుచరులతో ముద్రగడ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ముద్రగడ ఏ నిర్ణయం తీసుకుంటారు అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.ఇప్పటికే జనసేన, టీడీపీ నేతలు ముద్రగడ పద్మనాభంను కలిశారు. దీంతో ముద్రగడ పద్మనాభం టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. విషయం తెలిసిన వెంటనే అధికార పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. ముద్రగడను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు.ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ నేత ముద్రగడతో ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని, మీకు సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడేందుకు మిధున్ రెడ్డి మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడతారు అని ఆ నేత ముద్రగడ పద్మనాభంతో ఫోన్ లో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇప్పటికే నేను నిర్ణయాన్ని అయితే తీసుకున్నాను, వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని ఆ కీలక నేతతో ముద్రగడ పద్మనాభం తెగేసి చెప్పినట్లుగా సమాచారం.

మరోవైపు కాపు సామాజికవర్గానికి చెందిన కీలక నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును రంగంలోకి దించేందుకు, ముద్రగడ పద్మనాభంతో మాట్లాడేందుకు వైసీపీ వ్యూహాన్ని రచించింది.కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైపు మూడు పార్టీలూ చూస్తున్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ.. ఆయన కోసం వేచి ఉన్నాయి. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నాయి. మరోవైపు ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి కచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామన్నారు గిరిబాబు. ఈసారి మా నాన్న, నేను ఇద్దరం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే, పిఠాపురం నుంచి పోటీ చేస్తారా? ప్రత్తిపాడు నుంచి బరిలోకి దిగుతారా? లేదా కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మూడు పార్టీలకు చెందిన నేతలు ముద్రగడతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముద్రగడను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఎవరికి వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ముద్రగడ పద్మనాభం మాత్రం జనసేన వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.