గ్యారెంటీలను అమలు చేయకపోతే గ్యారెంటీగా ఇక ఉద్యమమే. తప్పుడు కేసులు పెడితే సహించేదే లేదు. సమీక్షాపర్వంతో కారు సైరన్ మోగింది. మళ్లీ ఉద్యమ విశ్వరూపం చూపిస్తామంటోంది బీఆర్‌ఎస్. తెలంగాణలో మళ్లీ పోల్ దంగల్ కాక మొదలైంది. తెలంగాణ దళం.. తెలంగాణ బలం మేమేనంటూ బీఆర్‌ఎస్ తన యాక్టివిటీని పెంచింది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములపై విశ్లేషణ.. మరోవైపు ఎమ్మెల్సీ లోక్‌సభ ఎన్నికలపై ఫుల్‌గా ఫోకస్ పెట్టింది బీఆర్‌ఎస్ హైకమాండ్. ఇప్పటికే ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష పూర్తయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక స్మాల్ బ్రేక్ ఇచ్చింది. కాస్త గ్యాప్ తీసుకుని పొలిటికల్ యాక్టివిటీని టాప్‌గేర్‌లో తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది బీఆర్‌ఎస్.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో క్యాడర్‌కు ధైర్యాన్నివ్వడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని దిశా నిర్దేశం చేశారు. ఇక గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజల పక్షాన మరోసారి బీఆర్‌ఎస్ ఉద్యమ విశ్వరూపాన్ని చూపిస్తామని స్పష్టం చేశారు గులాబీ నేతలు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీకి అసలు సినిమా మొదలవుతుందని హెచ్చరించారు కేటీఆర్. ఫిబ్రవరి నుంచే సినిమా స్టార్ట్ అవుతుందని హింట్ ఇచ్చారాయన. ఎన్నికల్లో ఎదురుదెబ్బలు, గెలుపులు సహజమనీ, ఓడిపోయామని నిరాశ చెందాల్సిన అవసరం లేదని తమ కేడర్‌కు భరోసా ఇచ్చారు. హామీలు అమలు చేసేవరకు పోరాటం చేస్తామని కేటీఆర్ వివరించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు కేటీఆర్. కేసులకు భయపడేది లేదన్నారు. తప్పుడు కేసులను కలిసికట్టుగా తిప్పికొడుతామన్నారు. బీఆర్‌ఎస్ ఎప్పటికీ బీజేపీకి బీ టీం కాదన్నారు కేటీఆర్. బీజేపీతో గతంలో పొత్తు లేదని.. భవిష్యత్తులోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు బీజేపీ బీ టీమ్ అయితే కవితపై కేసు పెట్టేవారా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూశాయన్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదన్నారు కేటీఆర్. ఓటమితో కుంగిపోయే ప్రసక్తే లేదు.. రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. ఓడినంత మాత్రాన ప్రజలను వదిలేయమన్నారు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడుతాం.. హామీల అమల కోసం అసెంబ్లీలో పోరాడతామన్నారు.