business-ayodya
జాతీయం ముఖ్యాంశాలు

లక్ష కోట్ల  వ్యాపారం

యావ‌త్ భార‌తీయులకు ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిరూపంగా ఈ నెల 22న అయోధ్య‌లో రామ మంద‌రి ప్రారంభోత్స‌వానికి అంగ‌రంగ వైభ‌వంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. రామ మందిర ప్రారంభోత్స‌వం నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా రూ.ల‌క్ష కోట్ల వ్యాపారం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అఖిల భార‌త వ్యాపారుల సంఘం (సీఏఐటీ) అంచ‌నా వేసింది. వివిధ రాష్ట్రాల్లోని 30 న‌గ‌రాల ప‌రిధిలో వ్యాపార సంస్థ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వ్యాపార సంఘాల నుంచి వ‌చ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ అంచ‌నాకు వ‌చ్చామ‌ని కెయిట్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్ ఖండేల్వాల్ తెలిపారు.`భార‌తీయుల న‌మ్మ‌కం, విశ్వాసానికి ప్ర‌తీక‌గా నిలిచిన ఈ వేడుక‌తో ఆర్థిక కార్య‌క‌లాపాలు పుంజుకుంటాయి. ప్ర‌జ‌ల విశ్వాసం, న‌మ్మ‌కంతో దేశంలోని సంప్ర‌దాయ ఆర్థిక వ్య‌వ‌స్థ ఆధారంగా ప‌లు కొత్త వ్యాపారాలు సృష్టించ‌బ‌డ‌తాయి` అని ప్ర‌వీణ్ ఖండేల్వాల్ చెప్పారు. రామ మందిర ప్రారంభోత్స‌వం నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా వ్యాపార సంఘాల ఆధ్వ‌ర్యంలో సుమారు 30 వేల విభిన్న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

శ్రీరామ్ చౌకీ, శ్రీరామ్ ర్యాలీలు, శ్రీరామ్ పాద‌యాత్ర‌, శ్రీరామ భ‌జ‌న‌లు, స్కూట‌ర్ అండ్ కార్ ర్యాలీలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో శ్రీరామ్ ప‌తాకాలు, బ్యాన‌ర్లు, టోపీలు, టీ-ష‌ర్ట్స్‌, రామ మందిరం చిత్రం ముద్రించిన కుర్తాల‌కు భారీ గిరాకీ ఏర్ప‌డింది. `దేశ‌వ్యాప్తంగా రామ మందిరాల మోడ‌ల్స్ కోసం డిమాండ్ శ‌ర‌వేగంగా పెరుగుతోంది. ఐదు కోట్ల‌కు పైగా మోడ‌ల్స్‌కోసం ఆర్డ‌ర్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నాం. ఈ మోడ‌ల్ రామాల‌యాల నిర్మాణం కోసం వివిధ రాష్ట్రాల్లోని న‌గ‌రాల్లో చిన్న త‌యారీ యూనిట్లు రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నాయి` అని ప్ర‌వీణ్ ఖండేల్వాల్ చెప్పారు.ఢిల్లీలోని పెద్ద చిన్న మార్కెట్లు.. 200కి పైగా ప్ర‌ధాన మార్కెట్ల‌న్నీ వ‌చ్చే వారానికి శ్రీరామ్ ప‌తాకాలు, అలంక‌ర‌ణ‌ల‌తో నిండిపోతాయ‌ని ప్ర‌వీణ్ ఖండేల్వాల్ అన్నారు. బృందావ‌నం, జైపూర్ ప్రాంతాల నుంచి వ‌చ్చిన గాయ‌కులు, జాన‌ప‌ద నృత్య‌కారుల ఆధ్వ‌ర్యంలో ప‌లు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో దేశ రాజ‌ధాని ఢిల్లీ హోరెత్తుతుంద‌న్నారు.