జాతీయం ముఖ్యాంశాలు

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌ మాజీ సీఎం వీర‌భ‌ద్ర‌సింగ్ క‌న్నుమూత‌

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు వీర‌భ‌ద్ర‌సింగ్‌(87) క‌న్నుమూశారు. దీర్ఘ‌కాలం అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న గ‌త కొంత‌కాలంగా సిమ్లాలోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. ఇందిరాగాంధీ మెడిక‌ల్ కాలేజీ, ఆస్ప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ జ‌న‌క్ రాజ్ మాట్లాడుతూ.. వీర‌భ‌ద్ర‌సింగ్‌కు గ‌త కొంత‌కాలంగా ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. ఏప్రిల్ 13న ఆయ‌న కొవిడ్‌-19కు గుర‌య్యార‌న్నారు. అనంత‌రం మోహాలీలోని మ్యాక్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. 1934 జూన్ 23న సిమ్లాలో జ‌న్మించిన‌ వీర‌భ‌ద్ర‌సింగ్ తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా అదేవిధంగా ఆరుసార్లు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సీఎంగా ప‌నిచేశారు.