కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా మారింది. ఎన్డీఏ లో రెండో పెద్ద పార్టీగా అవతరించింది. అందుకే కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. మిగతా భాగస్వామ్య పార్టీలకు లేనివిధంగా.. ఒక క్యాబినెట్ మంత్రి పదవితో పాటు సహాయ మంత్రి పదవి టిడిపి దక్కించుకుంది. రాష్ట్రంలో సైతం బిజెపికి ఒక మంత్రి పదవి కేటాయించారు చంద్రబాబు. అయితే ఎన్డీఏ సుస్థిరతకు పెద్దపీట వేసిన క్రమంలో.. తెలుగుదేశం పార్టీకి అన్నింటా ప్రాధాన్యం ఇవ్వాలని బిజెపి భావిస్తోంది. అందులో భాగంగా టిడిపికి గవర్నర్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అందుకే గవర్నర్ కోసం పేర్లు సూచించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు గవర్నర్ల పదవీకాలం ముగిసింది. కొత్తవారిని నియమించాలని బిజెపి భావిస్తోంది. అందుకే తన పార్టీలోని సీనియర్ల కోసం అన్వేషిస్తోంది. మరోవైపు టిడిపి కీలక భాగస్వామిగా ఉండడంతో ఆ పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ ను కేటాయించింది.
ఒకరి పేరును సూచించాలని చంద్రబాబుకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈరోజు బాధ్యతలు తీసుకున్న తర్వాత దీనిపై చంద్రబాబు దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏలో టిడిపి భాగస్వామ్య పార్టీగా ఉండేది. అప్పట్లో కూడా టిడిపికి గవర్నర్ పోస్ట్ కేటా ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో బిజెపి మ్యాజిక్ ఫిగర్ కు సొంతంగానే దాటి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో.. మిత్రపక్షాలకు అనుకున్న స్థాయిలో గవర్నర్ పోస్టులు కేటాయించలేదు. నాడు తెలంగాణ నేత మోత్కుపల్లి నరసింహులకు గవర్నర్ పోస్ట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అర్ధాంతరంగా చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. దీంతో అప్పట్లో గవర్నర్ పోస్ట్ కి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టిడిపికి తప్పకుండా గవర్నర్ పోస్ట్ కేటా యించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.తెలుగుదేశం పార్టీలో సీనియర్లు చాలామంది ఉన్నారు.
పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి సేవలందించిన వారు సైతం గవర్నర్ పోస్ట్ కు అర్హులుగా ఉన్నారు. అందులో ముఖ్యంగా ఉన్నారు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు. ఈ ఎన్నికల్లో ఇద్దరు నేతలు పోటీ చేయలేదు. కుమార్తెలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు. అయితే అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పోస్ట్ ఇస్తారని తెలుస్తోంది. అటు యనమల రామకృష్ణుడు సైతం ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే యనమలకు రాజ్యసభ ఆఫర్ ఉందని కూడా తెలుస్తోంది. అదే జరిగితే అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పోస్ట్ కు లైన్ క్లియర్ అయినట్టే.