chandra-shock
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టిక్కెట్ రాని నేతలపై టీడీపీ గురి

చంద్రబాబు రాజ్యసభ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఒకవైపు సాధారణ ఎన్నికల వ్యూహాల్లో ఆయన బిజీగా ఉండగా… ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందులో ఒక స్థానాన్ని దక్కించుకుంటే ఎన్నికల ముంగిట అధికార పార్టీకి గట్టి దెబ్బ కొట్టవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ సీటు కొట్టాలని బలమైన ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ఎత్తుగడలను గమనిస్తున్న జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎంపీలు ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో వారి స్థానంలో కొత్త వారి ఎంపిక అనివార్యంగా మారింది. ఇందుకు సంబంధించి మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ డిసైడ్ అయ్యింది. ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రతి 40 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ని ఎన్నుకోనున్నారు.

అయితే ఈ లెక్క చూస్తే వైసీపీకి మూడు స్థానాలు దక్కినట్టే. కానీ ఎన్నికల ముంగిట సమీకరణలు మారుతున్నాయి. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ టికెట్లు నిరాకరిస్తున్నారు. దీంతో వారిలో అసంతృప్తి నెలకొంది. అవకాశాలు ఉన్నవారు పక్క పార్టీలో చేరుతున్నారు. మిగతావారు సైలెంట్ అయ్యారు. సరిగ్గా ఇటువంటి సమయంలో రాజ్యసభ ఎన్నికల రావడంతో.. వీరంతా పట్టు బిగించే అవకాశాలు ఉన్నాయి.గత ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో గెలుపొందింది. టిడిపి 23 స్థానాలకే పరిమితమైంది. జనసేన ఒక స్థానంతో సరిపెట్టుకుంది. అయితే టిడిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించారు. అదే సమయంలో వైసీపీ నాయకత్వాన్ని విభేదించి నలుగురు ఎమ్మెల్యేలు టిడిపి వైపు వచ్చారు. గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. మొత్తం ఆరు స్థానాలకు గాను.. అన్ని సీట్లు వైసిపి దక్కించుకునే ఛాన్స్ ఉంది. కానీ అనూహ్యంగా టిడిపి ఆరో స్థానానికి పోటీ పెట్టింది. టిడిపి నుంచి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలతో కలిపి సునాయాసంగా విజయం సాధిస్తామని వైసిపి భావించింది.

కానీ వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంతో టిడిపి అభ్యర్థి విజయం సాధించారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో సైతం అదే రిపీట్ అవుతుందని టిడిపి భావిస్తోంది.తాజాగా జగన్ 25 మంది సిటింగ్లకు మొండి చేయి చూపారు. వారంతా టిడిపి, జనసేన వైపు చూస్తున్నారు. ఎప్పటికి టిడిపికి 23 స్థానాలు ఉన్నాయి. మరో 17 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించగలిగితే ఒక రాజ్యసభ స్థానం టిడిపి దక్కించుకునే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు ప్రత్యేక వ్యూహం రూపొందిస్తున్నారు. బలమైన రాజకీయ నేపథ్యమున్న నేతను గుర్తించే పనిలో పడ్డారు. భారీగా ఖర్చు చేయడం ద్వారా రాజ్యసభ స్థానాన్ని సునాయాసంగా కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంత ఖర్చు పెట్టడానికి ఎవరున్నారు? అనే కసరత్తు లోలోపల జరుగుతోంది. ఒకవైపు సాధారణ ఎన్నికలకు వ్యూహాలు రూపొందిస్తూనే.. మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కీలక బాధ్యతలను సీనియర్లకు అప్పగించినట్లు సమాచారం. అయితే ఎవరు పోటీ చేస్తారన్న దానిపై చివరి వరకు గోప్యత పాటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.