ayodya-cyber fraud
జాతీయం ముఖ్యాంశాలు

రాముడిని వదలని సైబర్ నేరగాళ్లు…

అయోధ్య రామమందిర  ప్రారంభోత్సవానికి కేవలం మరో 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ అద్భుత వేడుక కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. శ్రీరాముడి  దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. అదే అవకాశంగా భక్తుల ఉత్సుకతను కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. రాముడి పేరుతో మోసం చేస్తున్నారు. రాముడి వీఐపీ దర్శనం, విరాళాలు, ప్రసాదాల పేరుతో ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు.  వాట్సాప్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భక్తులను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రామాలయానికి విరాళాల సేకరణ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆలయం పేరుతో విరాళాలు సేకరించేందుకు క్యూఆర్‌ కోడ్‌లను పంపుతున్నారు. క్యూర్ కోడ్‌తో విరాళం శ్రీరామ జన్మభూమి తీర్థం ట్రస్ట్‌కు వెళ్తుందని నమ్మించి భక్తుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.  తెలియని, కొత్త మొబైల్ నంబర్‌ల నుంచి భక్తులకు అయోధ్య రామ మందిరం వీఐపీ దర్శనం పేరుతో ప్రత్యేకంగా మెస్సేజులు పంపుతున్నారు. అయోధ్య శ్రీరాముడిని ప్రత్యేకంగా వీఐపీ దర్శనం చేసుకోవాలనుకుంటే కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయాలంటూ సూచిస్తున్నారు.

దానిని క్లిక్ చేయడం చేస్తే ఫోన్ లోని డేటా చోరీ చేసే ప్రత్యేకమైన యాప్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. దీంతో సైబర్ నేరగాళ్లు ప్రజల బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. అలాగే రామ్ జన్మభూమి గ్రా సంపర్క్ అభియాన్‌ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే ఉచితంగా రాముని వీఐపీ దర్శనం చేసుకోవచ్చంటూ నమ్మిస్తున్నారు. వారు చెప్పిన మాటలు నమ్మితే అంతే సంగతులు. ఫోన్‌లో మాల్ వేర్ ఇన్ స్టాల్ అయ్యి ఫోన్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. అంతే సెకన్లలో మీ ఖాతాలు ఖాళీ అవుతాయి. అలాగే మూడో రకం స్కాం వెలుగులోకి వచ్చింది. ‘అభినందనలు, మీరు అదృష్టవంతులు, జనవరి 22న రామ మందిరంలో మీకు మీకు  వీఐపీ దర్శనం కల్పించడబడింది’ అంటూ మెస్సేజ్ వస్తోంది. ఇలాంటి మెసేజ్‌లపై స్పందించ వద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.   అయోధ్య రాముడి దర్శనం, ప్రసాదం గురించి మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఖాదీ ఆర్గానిక్ పేరుతో ఓ వెబ్‌సైట్ భక్తుల ఇళ్లకు తొలిరోజు పూజ ప్రసాదాన్ని అందజేస్తామని చెబుతోంది. ప్రసాదం కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కేవలం డెలివరీ ఛార్జీ రూ.51 చెల్లించాలని సూచిస్తోంది.

అయితే వెబ్‌సైట్‌లో రామమందిరంలోని ప్రసాదానికి, దానికి ఎలాంటి సంబంధం లేదని అక్కడ స్పష్టంగా రాసి ఉంది. ఈ వెబ్‌సైట్‌పై ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) కేసు నమోదు చేసింది. కేవీఐసీ చైర్మన్ మనోజ్ కుమార్ ఈ వెబ్‌సైట్ గురించి స్పందిస్తూ.. ఈ వెబ్‌సైట్ పూర్తిగా నకిలీదని కేవీఐసీతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రామ మందిరం పేరుతో జరుగుతున్న ఈ మోసాలపై విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ప్రజలను హెచ్చరించారు. మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆలయం పేరుతో జరుగుతున్న మోసానికి సంబంధించిన చిత్రాలను గత డిసెంబర్ 31 సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం పేరుతో కొందరు వ్యక్తులు నకిలీ ఐడీ తయారు చేసి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. విరాళాలు సేకరించడానికి శ్రీరామ తీర్థం ఎవరికీ అధికారం ఇవ్వలేదన్నారు.

ఎవరైనా రామ మందిరం కోసం విరాళం ఇవ్వాలనుకుంటే, అయోధ్య రామ మందిర నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ అధికారిక ఖాతాకు విరాళం ఇవ్వవచ్చు. డిసెంబర్ వరకు ఆలయ ఖాతాలో రూ.3,200 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు ట్రస్ట్ తెలిపింది. ట్రస్ట్‌లో అందుబాటులో ఉన్న సమాచారంలో, రామ మందిరానికి ఆధ్యాత్మిక గురువు, కథకుడు మొరార్జీ బాపు అత్యధిక విరాళం అందించారని చెప్పారు. రామాలయానికి రూ.11.30 కోట్లు విరాళంగా ఇచ్చారు.