రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. బీఆర్ ఎస్ ను ఓడించి, రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కానీ ఆ పార్టీకి మొదటి రోజు నుంచి ప్రభుత్వం కూలిపోతుందనే హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేయాలని బిఆర్ఎస్ ప్రయత్నిస్తే, తాను కూడా తగ్గే ప్రసక్తి ఉండదని మీడియా ముఖంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఏం జరిగినా లోక్ సభ ఎన్నికలు కీలకం. అందకే మైండ్ గేమ్ పాలిటిక్స్ ప్రారంభించారన్న అభిప్రాయం వినిపిస్తోంది.తెలంగాణాలో మూడు ప్రధాన పార్టీలకూ లోక్ సభ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బిఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని, పోయిన ప్రతిష్ఠను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. అందులోభాగంగా కేసీఆర్ కూడా పార్లమెంటుకు పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆయనతోపాటే కేటీఆర్, హరీశ్ రావు కూడా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతారని తెలుస్తోంది. అగ్రనాయకులు పోటీ చేయడంవల్ల పార్టీ కేడర్ లో నూతనోత్సాహం వస్తుందనీ, పార్టీకి చెందిన మిగిలిన అభ్యర్థులు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారన్నది కేసీఆర్ వ్యూహం. రానున్న లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపించకపోతే, క్యాడర్ నిరుత్సాహ పడటంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి దూకే ప్రమాదం లేకపోలేదని సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కప్పల తక్కెడలాంటి పార్టీని రేవంత్ తనదైన శైలిలో ఏకతాటిపై రేవంత్ నడిపిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం వద్దకు వెళ్లినప్పుడల్లా ఉప ముఖ్యమంత్రి భట్టిని వెంటబెట్టుకుని మరీ వెళ్తున్నారు. సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలకూ తగిన ప్రాధాన్యమిస్తూ, పార్టీలో అసమ్మతులకూ, అసంతృప్తులకూ చోటివ్వకుండా చూసుకుంటున్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. పార్టీ ఇచ్చిన హామీలను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ కు ఎంతో కీలకం. ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించలేకపోతే, పార్టీలో అసమ్మతులు, అలజడులు తప్పకపోవచ్చు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన రేవంత్… పార్టీ అధినేత్రి సోనియాగాంధీని తెలంగాణానుంచి పోటీ చేయించేందుకు పావులు కదుపుతున్నారు. దీనికి సోనియా కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కనబడుతోంది. అదే జరిగితే కాంగ్రెస్ కు ప్లస్ పాయింటేనని చెప్పవచ్చు. క్యాడర్ లోనూ, పార్టీ నాయకుల్లోనూ నూతనోత్సహం వస్తుంది. బీజేపీ కూడా తెలంగాణాలో లోక్ సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించి ఘోర తప్పిదం చేసిన బీజేపీ, లోక్ సభ ఎన్నికల్లో స్వయంకృతాపరాధాలకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్న బీజేపీ, ఈసారి మల్కాజ్ గిరి, జహీరాబాద్ స్థానాలపైనా దృష్టి పెట్టింది. రానున్న లోక్ సభ ఎన్నికలకోసం రాజస్థాన్ కు చెందిన సీనియర్ నేత చంద్రశేఖర్ ను తెలంగాణ రాష్ట్ర బిజేపి ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం వెనుక చంద్రశేఖర్ కృషి ఎంతో ఉంది.లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు మైండ్ గేమ్ కు తెరలేపాయి. ప్రత్యర్థుల ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే ధ్యేయంగా ఒకదానిని మించి మరొకటి మైండ్ గేమ్ ఆడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారనీ, ఏ క్షణాన్నయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూలుస్తారని సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పై విరుచుకుపడటం ద్వారా బీఆర్ఎస్ తమకు దగ్గర చుట్టం కాదని స్పష్టం చేయడమే బండి సంజయ్ లక్ష్యం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందిన పార్టీ కేడర్ ను కూడగట్టి, లోక్ సభ ఎన్నికల్లో గెలిచే ఉద్దేశంతో బిఆర్ఎస్ మైండ్ గేమ్ కు తెరతీసింది. సీనియర్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమే. ‘పార్టీ కార్యకర్తలు ఏడాది ఓపికపడితే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది.
సింహం రెండడుగులు వెనక్కి వేసిందంటే అందుకు కారణం, లక్ష్యంపై లంఘించడానికే. కేసీఆర్ కూడా అలాగే తిరిగివస్తారు’ అంటూ పార్టీ కేడర్ ను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. పైగా ఆయన కొన్ని లెక్కలు కూడా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 39 సీట్లకు, ఎంఐఎం ఏడు సీట్లు, బిజేపి 8 సీట్లు కలిపితే మొత్తం 54. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదు’ అన్నారాయన. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీని గద్దె దించితే, అప్రతిష్ఠ మూటగట్టుకోవాల్సి ఉంటుందన్న విషయం ఆయనకు తెలియనిది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా కాకముందే కేటీఆర్, హరీశ్ కూడా ఆరోపణలు సంధించడం మొదలుపెట్టారు. నిజానికి, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనేది వారికి తెలియని విషయం కాదు. కానీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో చేతులు కట్టుకుని కూర్చుంటే, కేడర్ మరింత నిరుత్సాహ పడుతుందనేది వారి ఆలోచన.
అందుకనే రుణమాఫీ, ఐదు హామీల అమలు వంటి అంశాలపై అధికార పార్టీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడకముందే, పార్టీలు ఇంత దూకుడుగా ఉన్నాయి. ఎన్నికలవేడి రాజుకున్నాక, ఈ మైండ్ గేమ్ మరింత తీవ్రతరం అవుతుంది. ఎవరు పైచేయి సాధిస్తే వారికి మెరుగైన ఫలితాలు రావొచ్చు