అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన భోలా దాస్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి శంకరాచార్య లేవనెత్తిన అభ్యంతరాలను పేర్కొంటూ పిటిషన్‌లో ప్రస్తావించారు. కార్యక్రమం సనాతన సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తుందని దుయ్యబట్టారు.ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 22న అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనున్న విషయాన్ని కోర్టు ఎదుట పిటిషన్‌లో ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం పాల్గొంటున్న విషయాన్ని పిటిషనర్ తెలిపారు. కార్యక్రమం ఎందుకు నిర్వహించకూడదో పిటిషన్‌లో ప్రస్తావించారు.
ప్రాణ ప్రతిష్ఠపై శంకరాచార్యులు అభ్యంతరం తెలిపారని, అలాగే ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉందని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఎలాంటి దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదన్నారు.అలాగే ప్రస్తుతం పుష్కమాసం నడుస్తుందని.. ఈ మాసంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరుగవని పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు. పిటిషనర్ న్యాయవాది అనిల్ కుమార్ బింద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న కార్యక్రమాన్ని నిలిపివేయాలని పిల్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
హైకోర్టులో త్వరగా పిటిషన్ విచారణకు స్వీకరించేలా చూస్తామన్నారు.మరోవైపు, జనవరి 22న భజన, కీర్తనలు నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను విచారించేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. ఈ ఏడాది యూపీలోని అన్ని దేవాలయాల్లో భజన-కీర్తనలు నిర్వహించాలని, రామచరిత్ మానస్ పఠించాలని, అన్ని నగరాల్లో రథ, కలశ యాత్ర చేపట్టాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.