ys family
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

రెండుగా చీలనున్న వైఎస్ కుటుంబం

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్‌వైభవాన్ని తెచ్చేందుకు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీలో రాజకీయం అనూహ్యంగా మారిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీలో జీరో. నిజానికి కాంగ్రెస్ లేదు కానీ కాంగ్రెస్ క్యాడర్ అంతా పటిష్టంగా ఉంది. కాకపోతే ఆ క్యాడర్ అంతా  జగన్మోహన్ రెడ్డి వైపు ఉంది. వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడం కాంగ్రెస్ కు నాయకత్వ అంటూ లేకపోవడంతో క్యాడర్ అంతా జగన్ వైపు వెళ్లిపోాయరు. కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న వర్గాలే ఇప్పుడు వైసీపీకి మద్దతుగా ఉంటున్నాయి. ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు రంగంలోకి దిగారు. అంటే నేరుగా తన అన్న పెట్టిన వైఎస్అర్ కాంగ్రెస్ ను కాంగ్రెస్‌గా మార్పు చేయాలన్న లక్ష్యంతో దిగుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. కానీ రాజకీయాల్లో  అడుగు పెట్టిన తర్వాత బలం ఎక్కడ ఉందో  చూసుకుని అక్కడ బరిలోకి దిగడం వ్యూహం. షర్మిల ఆ వ్యూహాన్ని పక్కాగానే అందుకున్నారు.

తండ్రి  బలోపేతం చేసిన పార్టీనే అందుకు ఆయుధంగా మలుచుకుంటున్నారు. అయితే  షర్మిలకు  నల్లేర మీద నడక కాదు.. ఎన్నో సవాళ్లను అధగమించాల్సి ఉంటుంది. ఆ విషయం ఆమెకు తెలియక కాదు. కానీ అన్నింటినీ ఆలోచించిన తర్వాతనే ఆమె రంగంలోకి దిగి ఉంటారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెడతారని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఆ ఆలోచనే కాస్త విభిన్నంగా ఉంది. అందుకే అందరూ ఆశ్చర్యపోయారు. అసలు చాన్సే ఉండదని ఎంతో  మంది చెప్పి ఉంటారు. కానీ  షర్మిల తన ప్రయత్నాల్లో లోపం రానీయలేదు. మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు.  తెలంగాణ రాజకీయాల్లో స్పేస్ లేకపోవడంతో షర్మిల ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. కానీ ఆమె పట్టుదల మాత్రం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరిచింది. ఏ మాత్రం అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఆమె  చూపించిన  పట్టుదల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చూపిస్తే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని  ఎక్కువ మంది భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే తాను ప్రధానంగా పోరాడాల్సింది సోదరుడు జగన్ పైనేనని షర్మిలకు తెలియనిదేమీ కాదు. అన్నీ ఆలోచించే షర్మిల రంగంలోకి దిగి ఉంటారు.

అందుకే మొహమాటాలు పెట్టుకునే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. షర్మిల ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు కానీ.. ఆమెకు సమయం చాలా తక్కువ ఉంది. మరో నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ ఉంది. మహా అయితే నెలన్నర  సమయం ఉంది. మార్చి  పదో తేదీకి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఆ తర్వాత తొలి విడతలోనే ఎన్నికలు పూర్తయిపోతాయి. అంటే గట్టిగా రెండు నెలలు మాత్రమే షర్మిలకు సమయం ఉంది. ఈ లోపు కాంగ్రెస్ ఎంతగా పుంజుకునేలా చేస్తే ఆమె రాజకీయ జీవితానికి అంత  భరోసా వస్తంది. అందుకే..షర్మిల ఈ రెండు నెలలు తీవ్రంగా పోరాడే అవకాశం ఉంది.షర్మిల రాజకీయంగా బలపడాలంటే ముందు సొంత గడ్డపై గట్టి పట్టు సాధించాలి.  అంటే కడప జిల్లాలో ఆమె తనదైన ముద్ర వేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎంత  రాజకీయం చేసిన వృధా అవుతుంది.

ఆ విషయం ఆమెకు తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో  మరో సోదరి , వివేకానందరెడ్డి కుమార్తె  వైఎస్ సునీతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తండ్రిని హత్య చేసిన వారిపై అలుపెరగని న్యాయపోరాటం చేస్తున్న ఆమె రాజకీయ రంగంలోనూ తేల్చుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. నిజానిక సునీత డాక్టర్ గా ఉన్నారు కానీ ఎప్పుడూ రాజకీయాల గురించి ఆలోచించలేదు. ఎప్పుడూ మీడియా ముందుకు కూడా రాలేదు. కానీ తండ్రి హత్య తర్వాత ఆమె అసామాన్యంగా పోరాడుతున్నారు. కుటుంబంలో కూడా మద్దతు రావడంతో ఆమె  రాజకీయాల్లోనూ అడుగు  పెట్టాలని అనుకుంటున్నారు.  వైఎస్ సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అటున్నారు. షర్మిల, సునీత పులివెందుల అసెంబ్లీ, కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.వైఎస్ సునీత, వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో దిగితే కడప జిల్లాలో ఫ్యామిలీ వార్ జరుగుతుంది.

వైఎస్ చనిపోయిన తర్వాత వివేకానందరెడ్డి కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. అప్పట్లో పులివెందుల ఉపఎన్నికల్లో  వినేకానందరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఓడిపోయారు. కానీ అప్పట్లో ప్రజల్లో విపరీతమైన సానుభూతి ఉంది. కుటుంబం కూడా వైఎస్ జగన్ వెంటే ఉంది. కానీ ఇప్పుడు వైఎస్ కుటుంబంలో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. ఎక్కువ శాతం మంది షర్మిల వైపు ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలో పులివెందులలో అన్నా, చెల్లెళ్లు రాజకీయ ప్రత్యర్థులుగా  పోరాటం జరిగితే ఊహించనంతగా రాజకీయం మారుతుంది.