బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలో ఎమ్మెల్సీలతో సమావేశమవుతారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆ సమావేశంలోనే శాసనమండలిలో పార్టీ నా యకుడి ఎంపిక ఉంటుందని చెప్పారు.
గురువారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమ య్యారు. ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీల భాగస్వామ్యం, పార్టీ శ్రేణుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ఎమ్మెల్సీలు పార్టీకి కండ్లు, చెవుల మాదిరి పనిచేయాలని సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమని, అప్పుడు బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉంటాయని వివరించారు. అన్ని స్థాయిల్లో పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపైకి తేవటంలో ఎమ్మెల్సీలు చురుకైన పాత్ర పోషించాలని కోరారు.
పార్టీని గ్రామస్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు పునర్వ్యవస్థీకరించాలనేది పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచనా విధానమని, అందుకు అనుగుణమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని చెప్పారు.