ktr
తెలంగాణ రాజకీయం

కరెంట్ బిల్లులు కట్టొద్దు

కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం.. కానీ వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ హితవు పలికారు. రేవంత్ రెడ్డి లాంటి అహంకారులను బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో అనేక మందిని చూసిందని అన్నారు.సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించినందుకు, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మార్చింనందుకు, ఇచ్చిన హామీలను సమగ్రంగా అమలు చేసినందుకు బీఆర్ఎస్‌ను బొంద పెడుతావా? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు కలిసిపోతాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రక్తం అంత బీజేపీదే అని అన్నారు.హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో ప్రసంగించిన కేటీఆర్.. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని చెప్పిన రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారారని విమర్శించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ లాంటి నాయకులను బీఆర్ఎస్ పార్టీ ఎన్నో చూసిందని.. అలాంటి వాళ్లందరూ మఖలో పుట్టి పుబ్బలో పోయేవాళ్లేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండున్నర దశాబ్దాలుగా పార్టీ నిలబడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజలపక్షమేనని స్పష్టం చేశారు.జనవరి నెల కరెంటు బిల్లులను ఎవరూ కట్టవద్దని కేటీఆర్ సూచించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకమైన గృహజ్యోతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా మహాలక్ష్మి ద్వారా ప్రతి ఒక్క మహిళకు రూ.2500 వెంటనే ఇవ్వాలన్నారు.

హామీలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బీజేపీతో బీఆర్ఎస్ కు ఏరోజూ పొత్తు లేదన్న కేటీఆర్.. భవిష్యత్ లోనూ ఉండదన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొంది, కేంద్రమంత్రి పదవి చేపట్టిన కిషన్ రెడ్డి ఈ ఐదేండ్లల్లో ఏం చేశారో చెప్పాలని ఆక్షేపించారు. కేసీఅర్ ప్రపంచంలోనే అతిపెద్ది లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే కిషన్ రెడ్డి మాత్రం సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో లిప్ట్ లను జాతికి అకింతం చేశారని ఎద్దేవా చేశారు.హైదరాబాద్ నగరంలో గులాబీ జెండాకు ఎదురులేదని బలమైన సందేశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీనే అని వెల్లడించారు. కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతన్నలకు రైతుబంధు అందడం లేదు.. మహిళలకు ఇస్తామన్న రూ.2500 రావడం లేదు.. కాంగ్రెస్ ఇచ్చినవి ఆరు గ్యారంటీలు కాదు 420 హామీలు అని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. వివిధ డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వెంటాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.