ఫార్ములా E రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు చిక్కులు వచ్చి పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఫార్ములా ఈ నిర్వహణ కంపెనీకి 55 కోట్లు చెల్లించారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు థర్డ్ పార్టీకి విడుదల చేసిన.. సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ కు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే తాను FIAకు నిధుల విడుదల నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈ గోల్‌మాల్ విషయంలో అర్వింద్‌కుమార్‌తో పాటు మాజీ మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం నేరం అవుతుంది. ఈ క్రమంలోనే క్యాబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్లు కుదుర్చుకున్న అధికారుల నుంచి గానీ మంత్రుల నుంచి గానీ డబ్బులు రికవరీ చేసిన సందర్భాలేమైనా ఉన్నాయా అని ప్రభుత్వం ఆరా తీస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా కోరినట్లు సమాచారం. లీగల్ అడ్వైజ్ రాగానే.. అర్వింద్ కుమార్‌తోపాటు కేటీఆర్‌పై క్రిమినల్ కేసులకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మంత్రిగా కేటీఆర్ చెప్పినా అర్వింద్‌కుమార్ నిధులు విడుదల చేయడం చట్ట విరుద్ధమే అవుతుందని అంటున్నారు.
ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి నాలుగు సీజన్ల కోసం 2023 అక్టోబరు 22న ఏస్ నెక్ట్స్ జెన్, ఫార్ములా-ఈ కంపెనీ, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది. ప్రభుత్వం తరపున హెచ్‌ఎండీఏ రూ.20 కోట్లు పెట్టి ట్రాక్ వేసిందని, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.35 కోట్లు ఖర్చు చేసింది. అయితే తర్వాత త్రైపాక్షిక ఒప్పందాన్ని మార్చుకున్నారు. స్పాన్సర్ షిప్ ఇస్తామని చెప్పిన గ్రీన్ కో కంపెనీ వైదొలిగింది. దీంతో ఖర్చు అంతా తెలంగాణ ప్రభుత్వంపై పడింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఫార్ములా-ఈ కంపెనీకి అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ రూ.55 కోట్లు చెల్లించారు. మరో రూ.55 కోట్లను కట్టాలంటూ కంపెనీ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదేదో గోల్ మాల్ వ్యవహారంలా ఉందని.. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్, అర్వింద్‌కుమార్ సీఎం రేవంత్ రెడ్డి పలు అవినీతి ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి.. ORR అగ్రిమెంట్ విషయంలో కోర్టులో కేసు కూడా వేశారు. ఈ ఫార్ములా రేస్ విషయంలో ఇద్దరి పేర్లూ తెరపైకి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.