అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలను చాలెంజింగ్ గా తీసుకుంది. ఆషామాషీగా కాకుండా పూర్తి స్థాయిలో విజయం కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. అందుకే అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ అభ్యర్థుల్లో బలంగా ఉన్న ఒకరిద్దర్ని తప్ప అందర్నీ మార్చేయాలనుకుంటున్నారు. దాదాపుగా అందర్నీ కొత్త వారిని దించి ప్రయోగం చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం తటస్థులైన ప్రముఖుల్ని సంప్రదిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సారి కొన్ని చోట్ల ఊహించని అభ్యర్థులు ఉండే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ టిక్కెట్ కోసం ఒక్కో నియోజకవర్గానికి ఐదు నుంచి పది మంది పోటీ పడతారు. కానీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్లు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఆసక్తి చూపని వాళ్లను అసలు లెక్కలోకి తీసుకోవడంలేదు. అభ్యర్థులపై ఎలాంటి సూచనలు కూడా ఇవ్వడంలేదు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చాలాకాలంగా చేస్తున్నారు. అయితే నియోజవకర్గాల సమీక్షల్లో కూడా అభ్యర్థులపై కనీసం హింట్ ఇవ్వడం లేదు. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు కానీ.. ఇంకొకరికి సీటు ఖాయం చేయలేదు. చివరికి కేసీఆర్ కుటుంబ సభ్యులకూ టిక్కెట్లు ఖరారు చేయలేదు. చివరికి మెదక్ నుంచి కేసీఆర్ , నిజామాబాద్ నుంచి కవిత పేర్లను కూడా ప్రకటించలేదు. వారిద్దరూ పోటీ చేయడం లేదని తేలిపోయింది. ఇక సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థుల్లో కనీసం ఆరుగురికి ఈ సారి టిక్కెట్ ఇచ్చే చాన్స్ లేదని భావిస్తున్నారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పేరును కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. ఖమ్మంలో పోటీ చేయడానికి ఆయన కంటే బలమైన అభ్యర్థి ఇంక ఎవరూ లేరు. ఆయన పోటీ చేయడం ఖాయమే. నల్లగొండ, భువనగిరి నియోజకర్గాల్లో పోటీకి పార్టీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. గుత్తా సుఖేందర్ తన కుమారుడు పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ ఆయనకు కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వలేదు.
ఉత్తర తెలంగాణలో కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారా లేదా అన్నది కూడా ప్రకటించలేదు. మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయడానికి ఇటీవల టీడీపీ నుంచి పార్టీలో చేరిన రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరును గతంలో అనుకున్నారు కానీ.. ఎన్నికల ఫలితాల తర్వాత ఇంకా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలన్న ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీకి 9 మంది లోకసభ సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన వారిలో నాగర్ కర్నూలు ఎంపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు ఈ సారి చాన్స్ ఉండదని భావిస్తున్నారు. అందుకే ఆయనకు చాన్స్ లేనట్లే. అదే సమయంలో కొంత మంది కీలక నేతలు, బడా వ్యాపారవేత్తలైన వారు కాంగ్రెస్ తరపున పోటీకి ఆసక్తి చూపుతున్నట్లుగా బీఆర్ఎస్ చీఫ్ అనుమానిస్తున్నారు.
ఎవరు ఉన్నా లేకపోయినా అయితే బీఆర్ఎస్ చీఫ్ మాత్రం ఈ సారి బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావించిన బీఆర్ఎస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సవాల్‌గా మారుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలు నిరాశకు గురిచేసినా, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని అధిగమించేలా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా పావులు కదుపుతోన్న గులాబీ దళానికి.. అసలైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే కేసీఆర్ తటస్థ ప్రముఖులపై దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని కూడా పోటీ చేయాలని కోరారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపారవేత్తలు కూడా బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉండరన్న వాదన వినిపిస్తోంది.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరగాలని కోరుకోవడమే బీఆర్ఎస్ పార్టీకి ముప్పుతిప్పలు తెచ్చి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మూడు నెలలకే మళ్లీ లోక్ సభ ఎన్నికల యుద్ధం చేయాల్సి వస్తోంది. అదీ కూడా రెండు జాతీయ పార్టీలతో. లోక్ సభ ఎన్నికలంటే జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. తమకే ఓటు వేయాలని ప్రజల్ని కన్విన్స్ చేయడం అంత తేలిక కాదు. అందుకే పోటీకి అభ్యర్థులు వెనుకాడుతున్నారు. తటస్థ ప్రముఖులు కూడా బీఆర్ఎస్ వైపు చూడటం సమస్యగానే మారుతోంది. బీఆర్ఎస్‌కు గత ఎన్నికల్లో 9 లోక్ సభ సీట్లు వచ్చాయి. ఈ సారి వాటిని నిలబెట్టుకుంటే గొప్ప విజయం సాధించినట్లే. క్యాడర్ కు నైతిక బలం వస్తుంది. ఆ దిశగా కేసీఆర్ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. మెదక్ వంటి చోట్ల గెలుపు నల్లేరు మీద నడక అయినప్పటికీ తేలికగా తీసుకోకూడదని డిసైడయ్యారు. ప్రతీ చోటా బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు.
గ్రేటర్ పరిధితో పాటు నల్లగొండ, పాలమూరు వంటి చోట్ల అనూహ్యమైన అభ్యర్థులు రంగంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పార్టీలోనే కీలకమైన, ప్రజల్లో ఉండే నేతల్ని బరిలోకి దించుతారని అంటున్నారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెజ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో.. షెడ్యూల్ రాగానే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది.