అయోధ్యలో ప్రతిష్ఠాత్మక రామ మందిర్ శంకుస్థాపన కార్యక్రమం(జనవరి 22న) ఘనంగా పూరైంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి దేశం, ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ రామభక్తులు ప్రస్తుతం రాంలాలా దర్శనం కోసం ఆసక్తిగా ఉన్నారు. జనవరి 23 అంటే రేపటి నుంచి సాధారణ భక్తుల కోసం రామాలయం తెరవబడుతుంది. ఈ మేరకు రామ మందిర తీర్థ క్షేత్ర కమిటీ భక్తుల దర్శనం, రాంలాల హారతి సమయాలను వెల్లడించింది.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెబ్‌సైట్ ప్రకారం రాంలాలా దర్శనం కోసం ప్రతిరోజూ వేర్వేరు సమయ వ్యవధిని ప్రకటించింది. ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు భక్తులు శ్రీరాముడి విగ్రహ దర్శనానికి అవకాశం కల్పించారు. దీని తర్వాత కొన్ని గంటలపాటు గర్భగుడి తలుపులు మూసి ఉంచుతారు. మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు తలుపులు తెరుచుకుని రాత్రి 7 గంటల వరకు భక్తులు రాంలాలా దర్శనం చేసుకోవచ్చు.ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించిన రాంలాలా విగ్రహానికి ప్రతి రోజూ రెండుసార్లు హారతి నిర్వహిస్తారు.
ప్రతిరోజూ ఉదయం 6.30 గంటలకు, సాయంత్రం 7.30 గంటలకు హారతి ఇస్తారు. అయితే హారతి సమయంలో సాధారణ ప్రజలను ఆలయంలోకి అనుమతించరు. ఏ భక్తుడైనా హారతి దర్శనం చేసుకోవాలనుకుంటే వారు ప్రత్యేక పాస్ తీసుకోవాల్సి ఉంటుంది.ఈ పాస్‌లను తీర్థయాత్ర వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో పొందవచ్చు. జన్మభూమిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆఫ్‌లైన్‌లో కూడా పొందవచ్చు. అయితే ఆలయానికి వచ్చే భక్తులు మాత్రం పాస్ కోసం చెల్లుబాటు అయ్యే IDని చూపించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఒకటి నుంచి లక్షన్నర మంది భక్తులు రాంలాల దర్శనం చేసుకుంటారని అంచనా.