జాతీయం ముఖ్యాంశాలు

2023 చివ‌రిలోగా అయోధ్య ఆల‌యంలో భ‌క్తుల పూజ‌లకు అనుమ‌తి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో ఉన్న రామ మందిరంలో 2023 చివ‌రి నాటికి పూజ‌ల కోసం భ‌క్తుల‌ను అనుమ‌తివ్వ‌నున్నారు. మొత్తం 70 ఎక‌రాల్లో ఈ ఆల‌యాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ పూర్తి నిర్మాణం 2025 చివ‌రిలోగా పూర్తి కానున్న‌ట్లు ట్ర‌స్ట్ ఆఫీస్ బేర‌ర్లు వెల్ల‌డించారు. 2023 చివ‌రిలోగా ప్ర‌ధాన ఆల‌యంలో పూజ‌ల కోసం భ‌క్తుల‌ను అనుమ‌తించ‌నున్న‌ట్లు ట్ర‌స్ట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంప‌త్ రాయ్ చెప్పారు.

శ్రీ రామ్ జ‌న్మ‌భూమి తీర్థ్ క్షేత్ర ట్ర‌స్ట్‌లోని 15 మంది స‌భ్యుల రెండు రోజుల స‌మావేశంలో ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తేడాది ఆగ‌స్ట్ 5న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆల‌యం కోసం శంకుస్థాప‌న చేసిన విష‌యం తెలిసిందే. అయితే గ‌త జ‌న‌వ‌రిలో ఆల‌యం నిర్మించ‌బోయే ప్రాంతంలో దిగువ‌న నీళ్లు రావ‌డంతో నిర్మాణాన్ని నిలిపేశారు. ప్ర‌స్తుతం ఇంజినీర్లు ఆల‌య పునాదిపై ప‌ని చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 15 క‌ల్లా ఇది పూర్తి కానుంది. దీపావ‌ళి స‌మ‌యంలో రెండో ద‌శ నిర్మాణ ప‌నులు ప్రారంభం కానున్నాయి.