రాష్ట్రాన్ని పదేళ్లు సుదీర్ఘంగా పాలించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రాన్ని రూ.6 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈమేరకు స్వేత పత్రాలను విడుదల చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ పరిస్థితిపై ఇప్పటికే స్వేత పత్రాలు విడుదల చేసింది. ఇక ఎన్నికల సమయంలో కుంగిన కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది రేవత్ సర్కార్. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుంది.అహంకారపూరిత వ్యవహారంతో అధికారం కోల్పోయింది బీఆర్‌ఎస్. ఒకవైపు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయడం, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం, ఇంకోవైపు ఉద్యోగాల భర్తీలో అలసత్వం, ప్రశ్నపత్రాల లీకేజీ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఓటమిని అనేక కారణాలు ఉన్నాయి.
అయినా తమ తప్పుల కారణంగానే ఓడిపోయామని బీఆర్‌ఎస్ ఇప్పటికీ అంగీకరించడం లేదు. ఎన్నికల జరిగి రెండ నెలలు కావొస్తున్నా.. కాంగ్రెస్ తప్పుడు హామీలతోనే తాము ఓడిపోయామని అదే అహంకార ధోరణితో బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. అంతే కాదు.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. హామీల అమలుకు ఇంకా సమయం ఉన్నా.. మాజీ మంత్రులు కేసీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత రేవంత్ సర్కార్‌పై ఎదురు దాడి మొదలు పెట్టారు. గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.సర్వం తప్పులు చేసి ప్రజలు ఓడించడంతో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని నాయకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈమేరకు మంత్రులు సీఎంకు విన్నవిస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టాలని కోరారు. దీంతో రేవంత్ సర్కార్ ఆ పని మొదలు పెట్టింది.
రూ.80 వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు దెబ్బతినడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్ట్‌మెంట్ అధికారులు విచారణ మొదలు పెట్టారు.కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.3,200 కోట్లు దుర్వినియోగం అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈమేరకు విజిలెన్స అండ్ ఎన్‌ఫోర్‌సమెంట్ అధికారులు నివేదిక సిద్ధంచేస్తున్నారు. వారం పది రోజుల్లో దీనిని ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చూసిన అధికారులు, మంత్రులతోపాటు, మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్‌ఎస్ నేతల దూకుడుకు చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.