నీలం సాహ్ని నియామకంపై పిటిషన్ దాఖలు
సలహాదారుల నియామకం, విధుల వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశం
ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్న వ్యక్తులు రాజకీయాలు మాట్లాడుతుండటంపై ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సలహాదారులు రాజకీయ నేతల మాదిరి మాట్లాడటమేంటని ప్రశ్నించింది. మీడియా ముఖంగా రాజకీయాలు మాట్లాడటం చట్ట వ్యతిరేకం కాదా? అని ప్రశ్నించింది. అంతేకాదు, ముఖ్య సలహాదారులు, సలహాదారుల నియామక విధివిధానాలు, విధులకు సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎస్ఈసీగా నీలం సాహ్నిని నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ జస్టిస్ దేవానంద్ బట్టు ఈ మేరకు ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.
పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ, 2020 మార్చి 31న నీలం సాహ్ని సీఎస్ గా పదవీ విరమణ చేశారని… డిసెంబర్ 22న ఆమెను సీఎం ప్రధాన సలహాదారుగా నియమించారని చెప్పారు. అయితే, 2021 మార్చి 27న సలహాదారు పదవికి ఆమె రాజీనామా చేశారని తెలిపారు. ఎస్ఈసీ నియామకానికి సంబంధించి మార్చి 24న రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వం పంపిన మూడు పేర్లలో సాహ్ని పేరు ఉందని… మార్చి 28న ఎస్ఈసీగా ఆమె నియమితులయ్యారని చెప్పారు.
ఈ సందర్భంగా గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ… మీరు అడ్వొకేట్ జనరల్ గా ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారులు మీడియాతో రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడటం చూశారా? అని జస్టిస్ దేవానంద్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అప్పట్లో అది జరగలేదని ఆయన సమాధానమిచ్చారు. ఈ పిటిషన్ పై సరైన విచారణ జరగాలంటే… సలహాదారుల నియామకం, వారి విధులను పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది.