పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో… పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు గులాబీ పార్టీ రెడీ అయింది. ఈ నెల 27 నుంచి శాసనసభ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ వెల్లడించారు.27న సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాలపై సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలన్నీ ఆయా నియోజకవర్గం కేంద్రాల్లోనే జరుగుతాయని కేటీఆర్ తెలిపారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నియోజకవర్గ సమన్వయకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. 28న సిరిసిల్ల, వర్ధన్నపేట, మెదక్, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల్లో, 29న ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జరిగే సమావేశాలకు పార్టీకి సంబంధించిన కీలకనేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. సమావేశాల నిర్వహణ బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు తీసుకోనున్నారు. ఈ నెల 27న ప్రారంభమై…ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, లోటుపాట్లు పై పూర్తిస్థాయి సమీక్ష జరపనున్నారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు, కార్యకర్తలతో చర్చించనున్నారు. ప్రతి రోజు ఐదు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై కేటీఆర్, నేతలు చర్చించనున్నారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పార్టీ అగ్రనేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికలపై అంతర్గతంగా సమీక్షలు చేస్తున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమావేశాలు ముగియడంతో ఇపుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై కేటీఆర్ దృష్టి పెట్టారు.పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహించింది. ఈ నెల 3 నుంచి లోక్ సభ నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేసింది. జనవరి 3న ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంతో సన్నాహక సమావేశాలు షూరూ చేసింది. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి పార్లమెంట్ స్థానాలపై సమీక్ష జరిపింది, 16న నల్గొండ, 17న నాగర్‌కర్నూల్, 18న మహబూబ్‌నగర్, 19న మెదక్, 20న మల్కాజ్‌గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరిగాయి.