liquor
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

బార్లకు ఆన్ లైన్ లో వేలం

పీవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న బార్‌ లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. కొత్త బార్‌ పాలసీలో భాగంగా 2022-25కు తగిన ఆప్‌సెట్‌ ప్రైజ్‌ రాకపోవడంతో 16 బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేయలేదు. ఇందులో గ్రేటర్‌ విశాఖలో రెండు, కాకినాడ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఒకటి, కృష్ణా జిల్లాలోని తాడిగడప, పెడన మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి, ఎన్‌టీఆర్‌ జిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి, గుంటూరు జిల్లాలోని తెనాలి మున్సిపాలిటీలో 4, పొన్నూరు మున్సిపాలిటీలో 2, బాపట్ల జిల్లాలో చీరాల మున్సిపాలిటీలో ఒకటి, నంద్యాల జిల్లాలోని నంద్యాల మున్సిపాలిటీ, తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపాలిటీలో ఒక్కొక్కటి చొప్పు బార్ల లైసెన్స్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.ఈ వేలం, ఆన్‌ లైన్‌ లాటరీ విధానంలో బార్లను కేటాయించనున్నారు.

ఈ నెల 28న మద్యాహ్నం 3 గంటలకు ఆన్‌ లైన్‌ లాటరీ విధానంలో కేటాయించేందుకు ఎక్సైజ్ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీరికి ఈ ఏడాది సెప్టెంబర్‌ 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు మద్యం అమ్ముకునేలా 2023-25 గెజిట్‌ జారీ చేశారు. 50 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు, నగర పంచాయతీల్లో దరఖాస్తు ఫీజుగా రూ.5 లక్షలు, 50 వేల పైన, ఐదు లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.7.50 లక్షలు, ఐదు లక్షలు పైబడిన ప్రాంతాల్లో రూ.10 లక్షలు దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. ఇది తిరిగి చెల్లించరని గెజిట్‌లో స్పష్టం చేశారు.ఒక ప్రాంతంలో బార్‌ లైసెన్స్‌ దక్కించుకున్న వారిని ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించనుంది. గతంలో బార్ల లైసెన్స్‌లు ఓపెన్‌ ఆక్షన్‌ విధానంలో ఒకే రోజు మంజూరు చేసేవారు. తద్వారా మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ప్రభుత్వ రాబడి తగ్గించే వారు. బిడ్డింగ్‌లో ఎవరు ఎంతకు కోట్‌ చేశారనేది కూడా గుట్టుగా ఉండటంతో వచ్చిన దాంట్లోనే అత్యధిక మొత్తానికి లైసెన్స్‌ మంజూరు చేసేవారు.

ఒకవేళ అంతకంటే ఎక్కువ మొత్తం కోట్‌ చేసేందుకు సిద్ధమైనా వ్యవధి లేక ఇతరులకు అవకాశం ఉండేది కాదు. ఈసారి లైసెన్సింగ్‌ విధానంలో ప్రభుత్వం దీనికి అడ్డుకట్ట వేయబోతోంది.ఒకేరోజు కాకుండా ఎంపిక చేసిన రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ బిడ్లను ఖరారు చేస్తారు. దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో బార్ల లైసెన్స్‌ పొందేందుకు వ్యాపారులకు అవకాశం ఇస్తే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా పోటీతత్వం పెరిగి ప్రభుత్వానికి రాబడి పెరుగుతుందని భావిస్తున్నారు.అత్యధికంగా కోట్‌ చేసిన వారిని హెచ్‌1గా ఎంపిక చేసి లైసెన్స్‌ కేటాయిస్తారు. బార్‌ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని బట్టి వచ్చిన బిడ్లలో పేర్కొన్న మొత్తాల్లో ఎక్కువ కోట్‌ చేసిన వారికి అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఇద్దరు ఒకే మొత్తాన్ని పేర్కొంటే డ్రా తీసి ఒకరికి కేటాయించడం జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో అత్యధిక కోట్‌ చేసిన వారిని హెచ్‌1గా ఎంపిక చేయడంతో పాటు ఇతర బార్ల లైసెన్స్‌లు కూడా అదే స్థాయిలో కోట్‌ చేస్తే లైసెన్స్‌ మంజూరు చేస్తారు.

కొద్దిగా అటుఇటుగా ఉండొచ్చని చెపుతున్నారు. అంటే 10 శాతం వరకు మాత్రమే తక్కువ కోట్‌ చేసేందుకు అనుమతించనున్నట్లు అధికారులు చెపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరు అత్యధికంగా కోట్‌ చేశారనేది ఇతరులు తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని బట్టి బిడ్‌ మొత్తంలో మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించనున్నారు.