తెలంగాణ ముఖ్యాంశాలు

1000 కోట్ల పెట్టుబడి.. తెలంగాణకు ‘కిటెక్స్‌’

  • కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో పెట్టుబడి
  • మెగా ప్రాజెక్టుతో 4వేల ఉద్యోగాల కల్పన
  • పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచ దిగ్గజం
  • కిటెక్స్‌ ప్రతినిధులతో కేటీఆర్‌ సుదీర్ఘ చర్చ
  • ప్రభుత్వ పాలసీని వివరించిన మంత్రి

నచ్చి.. మెచ్చి…
మంత్రి కేటీఆర్‌తో చర్చలు అద్భుతంగా సాగాయి. పెట్టుబడుల విషయంలో ఇంత వేగంగా స్పందించి, నిర్ణయాలు తీసుకొంటున్న ప్రభుత్వాలు చాలా అరుదు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు, రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ రంగానికి ఉన్న అనుకూలతలు, స్నేహపూర్వక వాతావరణం మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నది. అందుకే గత కొన్నేండ్ల నుంచి పెట్టుబడిదారులను విపరీతంగా ఆకట్టుకోగలుగుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే మేము తెలంగాణను తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్నాం.

రాష్ర్టానికి మరో భారీ పెట్టుబడి ఖరారైంది. పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ అయిన ‘కిటెక్స్‌ గార్మెంట్స్‌’ వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో తొలి విడుతగా రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో సుమారు 4 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సుదీర్ఘ చర్చల అనంతరం కిటెక్స్‌ సీఎండీ సాబు ఎం జాకబ్‌ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కిటెక్స్‌ సీఎండీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కిటెక్స్‌కు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిటెక్స్‌ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. అనంతరం మంత్రి కేటీఆర్‌తో సుదీర్ఘ చర్చలు జరిపి తమ పెట్టుబడి ప్రణాళికలను వివరించారు. తెలంగాణలో అమలవుతున్న టీఎస్‌-ఐపాస్‌ లాంటి పాలసీలతోపాటు ఇక్కడ ఉన్న స్నేహపూర్వక వాతావరణం, పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహకాలు, సింగిల్‌ విండో అనుమతులు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా తదితర అంశాల గురించి మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలోని నిపుణులైన మానవ వనరులు, టెక్స్‌టైల్‌ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి, రాష్ట్రంలో సాగవుతున్న నాణ్యమైన పత్తి తదితర అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. టీఎస్‌-ఐపాస్‌ విధానాల ప్రకారం కిటెక్స్‌ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి మెగా ప్రాజెక్ట్‌ హోదా లభిస్తుందని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు
తొలి దఫా చర్చల అనంతరం కిటెక్స్‌ బృందం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌లో వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను సందర్శించింది. టీఎస్‌ఎస్‌ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, ఇతర అధికారులు వారికి అక్కడి వసతులను వివరించారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ను చూసి కిటెక్స్‌ ప్రతినిధులు ముగ్ధులయ్యారు. ఇంత భారీ టెక్స్‌టైల్‌ పార్క్‌ను దేశంలో మరెక్కడా ఏర్పాటు చేయలేదని కొనియాడారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కిటెక్స్‌ ప్రతినిధులు ప్రగతి భవన్‌లో మరోసారి మంత్రి కేటీఆర్‌తో సమావేశమై తమ పెట్టుబడుల వివరాలను వెల్లడించారు. అనంతరం కిటెక్స్‌ సీఎండీ జాకబ్‌ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌తో చర్చలు అద్భుతంగా సాగాయన్నారు. తమ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించిన తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. పెట్టుబడుల విషయంలో ఇంత వేగంగా స్పందించి, నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలు చాలా అరుదని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు, రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ రంగానికి ఉన్న అనుకూలతలు, స్నేహపూర్వక వాతావరణం తమను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నదని కొనియాడారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే తాము తెలంగాణను తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్నామని తెలిపారు. తమ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా చాలా రాష్ర్టాల సీఎంలు తనను ఆహ్వానించారని, కానీ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిశ్చయించుకున్నామని జాకబ్‌ స్పష్టం చేశారు. కాగా కిటెక్స్‌ బృందం పర్యటన శనివారం కూడా కొనసాగనున్నది.

కిటెక్స్‌కు మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు
ప్రపంచంలోని రెండో అతిపెద్ద పిల్లల దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్‌ గ్రూప్‌ తెలంగాణలో వెయ్యి కోట్ల తొలివిడుత పెట్టుబడులతో వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు (కేఎంటీపీ)లో ఫ్యాక్టరీలు నెలకొల్పేందుకు ముందుకు రావడం హర్షణీయమని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. సత్వర నిర్ణయం తీసుకున్నందుకు గ్రూప్‌ ఎండీ సాబు ఎం జాకబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.