తెలంగాణ ముఖ్యాంశాలు

కిటెక్స్‌ తరలి వచ్చిన కథ ఇదీ!

  • 1000 కోట్లు.. 4000 ఉద్యోగాలు
  • వెయ్యి కోట్ల పెట్టుబడి వెనుక కేటీఆర్‌ దీక్ష
  • సర్కారు సమయస్ఫూర్తి.. అధికార్ల పట్టుదల

మాటలెన్నో చెప్పవచ్చు. విమర్శలూ చేయవచ్చు. కానీ ఒక పెద్ద కంపెనీని, వేల ఉద్యోగాలు కల్పించే వేల కోట్ల పెట్టుబడిని, పోటీ పడే అనేక రాష్ర్టాలను కాదని తేవడం అంత సులువు కాదు. మెకానికల్‌గా, సోకాల్డ్‌ బ్యూరోక్రటిక్‌గా పనిచేస్తే ఏదీ జరగదు. ఇంప్రెస్‌ చేసే పాలసీ, కన్విన్స్‌ చేసే సామర్థ్యం, మురిపించే ఇన్ఫ్రాస్ట్రక్చర్‌… వీటన్నింటికీ తోడు గురితప్పని టైమింగ్‌, ప్రేమతో కూడిన ఆతిథ్యం… ఇవన్నీ కలగలసి మెప్పిస్తేనే జన్మభూమిలో పరిశ్రమలు పెట్టాలన్న కల నిజమవుతుంది. అలా నిజమైన ఒక కలకు నిదర్శనమే కిటెక్స్‌ కంపెనీ తెలంగాణకు వచ్చిన తీరు. పారిశ్రామిక వర్గాల్లో, రాజకీయ రంగంలో పెను సంచలనానికి కారణమైన కిటెక్స్‌ కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టడం వెనక మంత్రి కేటీఆర్‌ కృషి పరిశ్రమలు సాధించడానికి రోల్‌మోడల్‌ వంటిది. తెలంగాణపై కేసీఆర్‌ ప్రభుత్వానికున్న ప్రేమకు తాజా ఉదాహరణమిది. కిటెక్స్‌ రాక వెనక అత్యంత నాటకీయంగా జరిగిన పరిణామాలపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం…

వివాదంతో తరలింపు
కిటెక్స్‌ గ్రూప్‌ సుమారు 50 ఏండ్లుగా కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. కంపెనీ విస్తరణలో భాగంగా ఇటీవలే రూ.3,500 వేల కోట్లతో ఒక మెగా ప్రాజెక్టును ప్రకటించింది. అయితే ఈదశలోనే కేరళ వామపక్ష ప్రభుత్వానికి, కంపెనీకి మధ్య విభేదాలు తలెత్తాయి. కేరళ ప్రభుత్వం అనేక విభాగాల అధికారులతో సోదాలు చేయిస్తూ, తమను అనవసరంగా వేధిస్తున్నదని కంపెనీ ఎండీ జాకబ్‌ వెల్లడించారు. కేరళలో పెట్టాలనుకుంటున్న పెట్టుబడిని ఉపసంహరించుకుంటున్నామని, దీన్ని బయటకు తరలిస్తామని వారం కిందట ప్రకటించారు.

10 రాష్ర్టాలు పోటా పోటీ
ఇది తెలియగానే అనేక రాష్ర్టాలు జాకబ్‌ను సంప్రదించా యి. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించాయి. కర్ణాటక సీఎం యడ్యూరప్ప స్వయంగా జాకబ్‌తో మాట్లాడారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ సహా దాదాపు 10 రాష్ర్టాలు ఆయన్ను సంప్రదించాయి. కానీ వీరందరికన్నా ముందే జాకబ్‌తో తెలంగాణ టచ్‌లోకి వెళ్లింది. పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ మొదట జాకబ్‌తో మాట్లాడారు. తర్వాత మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగారు. అప్పటికి కిటెక్స్‌ యాజమాన్యం అంతగా సానుకూలంగా స్పందించలేదు.

వారికోసం ప్రత్యేక విమానం
‘మీరేమీ ముందే మాకు నిర్ణయం చెప్పనక్కర్లేదు. ఒక్కసారి మా రాష్ర్టానికి రండి. ఇక్కడి పారిశ్రామిక వాతావరణం చూడండి. మా ప్రభుత్వం ఎంత ప్రోయాక్టివ్‌గా ఉందో గమనించండి. తర్వాతే మీ నిర్ణయం ప్రకటించండి’ అంటూ కేటీఆర్‌ జాకబ్‌ను ఆహ్వానించారు. టెక్స్‌టైల్స్‌ తమ ప్రభుత్వ ప్రాధాన్య రంగాల్లో ఒకటని నచ్చజెప్పారు. అప్పటికీ జాకబ్‌ పెద్దగా ఆసక్తి చూపలేదు. “పెట్టుబడి సంగతి తర్వాత. మా ప్రభుత్వం ఎలా పని చేస్తున్నదో చూడడానికైనా తెలంగాణకు రండి. మీ బృందం కోసం నేను ప్రత్యేక విమానం పంపిస్తున్నా. డేట్స్‌ చెప్పండి” అని జాకబ్‌కు చెప్పారు కేటీఆర్‌! జాకబ్‌ ఆశ్చర్యపోయారు. ఒక పరిశ్రమ కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక విమానాన్ని పంపించడం ఏమిటని అనుకున్నారు. కేరళ సర్కారు తీరుతో విసిగిపోయి ఉన్న ఆయనకు ఇది కొత్తగా కనిపించింది. “సరే చూడడానికి వస్తా. నిర్ణయం తర్వాత చెబుతా” అంటూ జాకబ్‌ అంగీకరించారు. కేటీఆర్‌ వెంటనే విమానం అరేంజ్‌ చేశారు. కిటెక్స్‌ బృందం తెలంగాణకు పోతున్నట్టు జాతీయ, కేరళ వార్తా సంస్థలు అప్పటికే గగ్గోలు మొదలుపెట్టాయి. కిటెక్స్‌ సంస్థ పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. కానీ కేటీఆర్‌ సంయమనం పాటించారు. కన్‌ఫర్మ్‌ కానిదే ప్రకటన వద్దనుకున్నారు.

ఇదీ మా విధానం
ప్రభుత్వం పంపించిన ప్రత్యేక విమానంలో శుక్రవారం ఉదయం జాకబ్‌ బృందం హైదరాబాద్‌లో దిగింది. కాకతీయ ఐటీసీ హోటల్‌లో సమావేశం. తెలంగాణ అంటే ఏమిటి? ఐపాస్‌ ద్వారా పరిశ్రమలకు ఎలా 15 రోజుల్లోనే అనుమతులు ఎలా లభిస్తున్నాయి? 24 గంటల కరెంటు ఎలా అందుబాటులో ఉంది? పరిశ్రమలకు నీళ్ల లభ్యత ఎలా ఉంది? తదితర అంశాలపై కేటీఆర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తమ కంపెనీ విశేషాల గురించి జాకబ్‌ బృందం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. అప్పటికీ జాకబ్‌ బృందం నుంచి పూర్తిస్థాయి సానుకూలత రాలేదు.

వరంగల్‌ కోసం హెలికాప్టర్‌
“వచ్చిన వాళ్లు ఎలాగూ వచ్చారు. వరంగల్‌లో మాకు కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుంది. దాన్ని చూసి పొండి. బాగుంటుంది” అని కేటీఆర్‌ మళ్లీ ఆఫర్‌ చేశారు. వరంగల్‌ వెళ్లి వచ్చేంత సమయం లేదని జాకబ్‌ బృందం బదులిచ్చింది. “టైం గురించి మీకెందుకు? నేను హెలికాప్టర్‌ అరేంజ్‌ చేస్తాను” అంటూ కేటీఆర్‌ అప్పటికప్పుడు హెలికాప్టర్‌ని అరేంజ్‌ చేశారు. కిటెక్స్‌ బృందం వరంగల్‌కు పయనమైంది. వారితో పాటు అక్కడికి వెళ్లిన అధికారులు మెగా పార్క్‌ విశేషాలను వారికి తెలియజేశారు. అక్కడి ఏర్పాట్లు చూసిన జాకబ్‌ బృందం అదిరిపోయింది. సాయంత్రానికి హెలికాప్టర్లోనే హైదరాబాద్‌ తిరిగివచ్చారు.

గంటల్లోనే నిర్ణయం ఖరారు
హెలిప్యాడ్‌లో దిగగానే తాము మంత్రి కేటీఆర్‌ని కలుసుకోవాలనుకుంటున్నట్టు జాకబ్‌ బృందం అధికారులకు తెలిపింది. హోటల్‌లో ఎందుకు? ప్రగతి భవన్‌కే తీసుకురండంటూ… కేటీఆర్‌ వారిని సీఎం క్యాంపాఫీసుకు ఆహ్వానించారు. అక్కడికి చేరగానే కిటెక్స్‌ బృందం… తెలంగాణ ప్రభుత్వాన్ని, కేటీఆర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. తెలంగాణలో తాము వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులూ పెడతామని హామీ ఇచ్చారు. కేటీఆర్‌ అక్కడే వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేసి ధన్యవాదాలు తెలిపారు. దాదాపు గంటన్నర సేపు వారితో గడిపి, ఏ పరిస్థితుల్లో తెలంగాణ తెచ్చుకున్నామో, ఇక్కడి యువతకు ఎందుకు ఉద్యోగాలు అవసరమో వివరించారు. ఏ నిర్ణయమూ లేకుండా తెలంగాణ వచ్చిన కిటెక్స్‌ బృందాన్ని గంటల్లోనే నిర్ణయం తీసుకునేలా కేటీఆర్‌ బృందం ఒప్పించగలిగింది.

పారిశ్రామిక సంచలనం
కిటెక్స్‌ కంపెనీ కేరళ రాష్ట్రంలో పుట్టి, అక్కడే వేళ్లూనుకున్న సంస్థ. అక్కడి ప్రజలతో మమేకమైన సంస్థ. అలాంటి సంస్థ పెట్టుబడిని, ఆ రాష్ర్టాన్ని కాదని తెలంగాణ తెచ్చుకోగలిగింది. కిటెక్స్‌ కోసం పోటీపడ్డ 10 రాష్ర్టాలను కాదని, మరీ రాబట్టుకోగలిగింది. ఇందుకోసం అధికారులు, కేటీఆర్‌ వెచ్చించిన సమయం అంతా ఇంతా కాదు. ఒక ప్రభుత్వం ఈ స్థాయిలో ఇంత స్పీడ్‌గా స్పందించి, నిర్ణయాలు వెలువరించడం తామెన్నడూ చూడలేదని జాకబ్‌ నాలుగైదు సార్లు వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణలో ఏం జరుగుతున్నది? కిటెక్స్‌ పెట్టుబడి పెడుతున్నదా? అని కేరళ జర్నలిస్టులు, జాతీయ పాత్రికేయులు అనేకమంది సాయంత్రం లోపు అనేక సార్లు అధికారులకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ కిటెక్స్‌ రాక ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో సంచలనం. రాజకీయ వర్గాల్లో కలకలం. తెలంగాణ ప్రభుత్వ పనితనానికి గీటురాయి.

ఇప్పుడు వచ్చిన కిటెక్స్‌ పెట్టుబడి వెయ్యికోట్లు. దాని విలువ నాలుగు వేల ఉద్యోగాలు.
తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కేసీఆర్‌ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో
పనిచేస్తున్నదనడానికి ఇంతకుమించి ఉదాహరణ కావాలా?