kutami
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

కూటమిలో సీట్ల జగడం…

రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. వైసీపీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు పార్టీలతోపాటు బీజేపీని కూడా కూటమిలో చేర్చుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్ని సవ్యంగా సాగితే మరో రెండు వారాల్లో కూటమిపై స్పష్టత వస్తుంది. బీజేపీని కూటమిలో చేర్చే విషయంపై తుది చర్చలు జరిపేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఢిల్లీకి వెళతారని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదంతా ఒకపక్క జరుగుతుండగా.. మరోపక్క సీట్ల పంపకాలపై కూటమిలో జగడం తప్పేలా లేదన్న ప్రచారమూ సాగుతోంది. తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు దీన్ని సమర్థించేలా ఉన్నాయి.

చంద్రబాబు పొత్తు ధర్మాన్ని విస్మరించి రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడాన్ని సీరియస్‌గా తీసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. తాను కూడా రెండు సీట్లలో జనసేన అభ్యర్థులను ప్రకటించారు. ఈ వ్యవహారం ఒక్కసారిగా ఇరు పార్టీల నేతల్లో ఆందోళనకు కారణమైంది. తాజా పరిస్థితులు నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాలు కూటమిలో జగడానికి కారణమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.ఈ రెండు పార్టీల సీట్ల సర్ధుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. జనసేనకు ఇన్ని సీట్లే ఇస్తారంటూ ఒక వర్గం నుంచి ప్రచారం జరుగుతుండగా, కాదు ఇన్ని సీట్లు ఇస్తారంటూ మరోవైపు ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఇరు పార్టీల్లోనూ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అనుగుణమైన అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వారంతా పని చేసుకుంటూ వెళుతున్నారు. తమకే సీటు వస్తుందంటూ ఇరు పార్టీలకు చెందిన నేతలు అనుచరులు వద్ద చెబుతున్నారు.

అయితే, ఇదే ఇప్పుడు ఇరు పార్టీలకు ఇబ్బందిగా పరిణమించే అవకాశముంది. రాష్ట్రంలో సుమారు వంద అసెంబ్లీ స్థానాల్లో ఇరు పార్టీలకు ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నుంచి నలుగురు బలమైన నాయకులు ఉంటున్నారు. వీరంతా తమకే సీట్లు వస్తాయన్న నమ్మకంతో పని చేస్తున్నారు. సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయి అక్కడ అభ్యర్థులను ప్రకటిస్తే మిగిలిన వారంతా ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఇరు పార్టీల అగ్రనాయకులను ఆందోళనకు గురి చేస్తోంది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై ఎంత అభిమానం ఉన్నా.. సీట్లు రాని మరుక్షణం వారంతా తీవ్ర స్థాయిలో స్పందించే అవకాశం ఉంది. ఎన్నికలు ముందు సదరు నాయకులు స్పందించే తీరు ఇరు పార్టీలకు ఇబ్బందిగా పరిణమించే చాన్స్‌ ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటిని ఎంత వరకు ఇరు పార్టీల నాయకులు అడ్డుకట్ట వేయగలుగుతారన్నది చూడాల్సి ఉంది. ఒక పక్క వైసీపీ దశలు వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. టీడీపీ, జనసేన మాత్రం ఇప్పటి వరకు ఒక్క జాబితాను కూడా విడుదల చేయలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యరర్థులపై ఒక స్పష్టతను ఇస్తే వారంతా పని చేసుకునేందుకు అవకాశముంటుంది. ఆలస్యం చేయడం వల్ల పార్టీకి ఇబ్బందిగా మారుతుంది.

ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికైనా చంద్రబాబు సీట్లు ప్రకటించాలని కోరారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి బయటకు చెప్పారు.. మిగిలిన నాయకులు ఆ విషయాన్ని చెప్పలేకపోయారు గానీ.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నాయకులు అభిప్రాయం ఇలానే ఉంది. ఆలస్యం చేసే కొద్ది పార్టీకి నష్టమే తప్పా లాభం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఇరు పార్టీలు సీట్ల పంపకాలపై ఒక నిర్ణయానికి వచ్చి అభ్యర్థులను ప్రకటించాలని కోరుతున్నారు.