తెలంగాణ ముఖ్యాంశాలు

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. గుంటూరు వాసి వీరమరణం

విధి నిర్వహణలో అమరుడైన జవాన్‌ జశ్వంత్‌రెడ్డి
హైదరాబాద్‌, జులై 9 (నమస్తేతెలంగాణ): కశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు వీరమరణం చెందగా వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మరుపోలు జశ్వంత్‌రెడ్డి (23) ఉన్నారు. బాపట్ల మండలం దరివాదకొత్తపాలెం వాసి జశ్వంత్‌రెడ్డి ఐదేండ్ల కిందట సైన్యంలో చేరారు. నెల క్రితమే సెలవుపై ఇంటికొచ్చిన ఆయనకు పెండ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు ఏపీ సీఎం జగన్‌ ప్రకటించారు. రాజౌరి జిల్లా సుందర్‌బాన్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చేపట్టగా ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జశ్వంత్‌ రెడ్డి మృతదేహాన్ని బాపట్లకు తీసుకువచ్చారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.