హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత నెల 27న రైతులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా స్థానిక రైతులుగా మినీ సెక్రెటేరియట్ ముట్టడికి బయలుదేరారు. అయితే సెక్రెటేరియట్ ఆవరణలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ నేత రాకేష్ తికాయిత్, రాష్ట్ర అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ సహా పలువురు నాయకులు, భారీ సంఖ్యలో రైతులు ఈ ముట్టడి కార్యక్రమానికి హాజరయ్యారు.
అయితే, మినీ సెక్రెటేరియట్ ముట్టడికి వచ్చిన రైతులను పోలీసులు అడ్డగించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొన్నది. కాగా, రైతులు మినీ సెక్రెటేరియట్ ముట్టడి తలపెట్టడంతో కర్నాల్ జిల్లా అధికారులు ఈ నిరసన కార్యక్రమాన్ని నిలిపివేయడం కోసం పలు దఫాలుగా రైతు నేతలతో చర్చించారు అయినా చర్చలు విఫలం కావడంతో రైతులు తమ నిరసన కొనసాగిస్తున్నారు.