ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తోంది. నెల రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇంచార్జిల మార్పుపై వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. మరో వైపు ఇప్పటికే ఎన్నికల శంఖారావం కూడా పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.బొబ్బిలిలో సిద్దం సభ ద్వారా సమరశంఖం పూరించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. మరో నాలుగు ప్రాంతాల్లో సభలు పెట్టేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పాగా వేయాలనేదీ ముఖ్యమంత్రి జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలను ఒకచోట నుంచి మరో చోటుకి మారుస్తున్నారు. మరికొంత మందికి టిక్కెట్లు నిరాకరిస్తున్నారు.
ఇక, లోక్ సభ స్థానాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు వైఎస్ జగన్. కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యఃర్ధులుగా పంపిస్తున్నారు. మరికొంత మంది ఎంపీలను ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జిలుగా నియమించారు. ఆయా అభ్యర్ధులపై వచ్చిన సర్వే నివేదికలు, పనితీరు ఆధారంగా ఈ మార్పులు చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. స్థానికంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు పార్టీ కేడర్‌ను కలుపుకునిపోవడంలో విఫలమైన అభ్యర్ధుల విషయంలో పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా చోట్ల అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఇంచార్జిలను కూడా మార్పు చేశారు.ఇప్పటివరకూ మొత్తం నాలుగు జాబితాలు ప్రకటించింది వైఎస్సార్‌సీపీ. మొత్తం 68 స్థానాలకు ఇంచార్జిలను మార్పు చేశారు. వీటిలో 58 అసెంబ్లీ స్థానాలుండగా, మరో 10 ఎంపీ స్థానాలున్నాయి. జనవరి 18వ తేదీన నాలుగో విడత జాబితాను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. అప్పటి నుంచి ఐదో విడత జాబితాపై పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు.
అయితే, కొన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపికలో వైసీపీ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. సామాజిక సమీకరణాలతో పాటు గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్ధులపై కసరత్తు కొలిక్కి రావడం లేదు. కసరత్తు పూర్తికాకపోవడంతో ఐదో విడత అభ్యర్ధుల ప్రకటన రోజురోజుకూ ఆలస్యం అవుతుంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిల మార్పులో భాగంగా ఇప్పటివరకూ 58 అసెంబ్లీ స్థానాలతో పాటు 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్దులను మార్పు చేశారు. మిగిలిన 13 ఎంపీ స్థానాల్లో మూడు స్థానాల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ స్థానాలు పదిలంగానే ఉన్నాయి. ఇక, మిగిలిన పది స్థానాల అభ్యర్ధుల ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వీటిలో ఒకట్రెండు స్థానాలకు క్లారిటీ వచ్చిందని తెలిసింది. మిగిలిన ఏడెనిమిది స్థానాలకు పలువరు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు.అలాగే అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా కొన్ని మార్పులు చేద్దామనుకున్న స్థానాలను సిట్టింగ్‌లకే ఇచ్చేలా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వీటిలో బొబ్బిలి సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడుకు తిరిగి కేటాయించే చాన్స్ ఉంది. ఇక్కడ కొప్పుల వెలమ అభ్యర్ధిని రంగంలోకి దించాలని అనుకన్నప్పటికీ సరైన అభ్యర్ధి దొరక్కపోవడంతో అప్పలనాయుడును కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇక, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కు తిరిగి ఇదే స్థానం ఖరారయ్యే అవకాశం ఉంది. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్‌కు తిరిగి అక్కడే సీటు కేటాయించే అవకాశం ఉంది.ఇక ఎంపీ స్థానాలకు అభ్యర్దుల ఎంపిక కొలిక్కి రాలేదు. విజయనగరం ఎంపీగా మజ్జి శ్రీను అనుకున్నప్పటికీ ఈయన స్థానంలో చంద్రశేఖర్ పేరు వినిపిస్తుంది. అనకాపల్లి ఎంపీ అభ్యర్దిగా మంత్రి గుడివాడ అమర్నాధ్ పేరు వినపడుతుంది. ఇక కాకినాడ పార్లమెంట్ స్థానానికి చలమలశెట్టి సునీల్ పేరు దాదాపు ఖరారయినట్లేనని తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీగా జక్కంపూడి రాజా పేరు పరిశీలించినప్పటికీ వెలమ సామాజిక వర్గం అభ్యర్ధి కోసం పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అమలాపురం ఎంపీగా ఎలీజా అనుకున్నప్పటికీ ఆయన స్థానంలో మరొకరి కోసం అధిష్టానం పెద్దలు వెతుకుతున్నారు.మచిలీపట్నం పార్లమెంట్ ఇంచార్జిగా అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేరు పరిశీలనలో ఉంది..గుంటూరు స్థానానికి మేయర్ కావటి మనోహర్ నాయుడు పేరు మొదట్లో పరిశీలించినా, ఆయన వద్దనుకున్నట్లు తెలిస్తోంది.
అందుకే మరో బలమైన అభ్యర్ది కోసం అధిష్టానం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. నరసరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ దాదాపు ఖరారయినట్లే అని సమాచారం. నంద్యాల టిక్కెట్‌ను మైనార్టీలకు ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధిగా మద్దిశెట్టి వేణుగోపాల్ లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ పెద్దల నుంచి అందుతున్న సమాచారం.ఈ స్థానాలపై కసరత్తు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఐదో జాబితా విడుదల చేసేలా వైఎస్సార్సీపీ అధిష్టానం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జాబితాతో మొత్తం అభ్యర్దుల మార్పులు చేర్పులుకు ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు సమాచారం.