kumari aunty
తెలంగాణ ముఖ్యాంశాలు

కుమారి ఆంటీ వ్యాపారం క్లోజ్…

కుమారీ ఆంటీ.. ఇటీవల సోషల్‌ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేరు. హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి పరిసరాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలతో బాగా ఫేమస్ అయిపోయింది. యూట్యూబ్‌ ఛానెల్స్ అయితే ఆమెతో ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టాయి. కుమారీ ఆంటీకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె బిజినెస్‌ ఇన్ని లక్షలు జరుగుతుందని, సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్‌ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం సాగింది. అంతేకాదు బిగ్‌బాస్‌ రాబోయే సీజన్‌లోనూ కుమారి ఆంటీ కనిపిస్తారంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ కథనాలు అల్లేశాయి. ఇలా మొత్తానికి సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది కుమారి ఆంటీ. యువకులంతా ఆమె దగ్గరే భోజనం చేసుందుకు ఎగబడుతున్నారు. అయితే ఈ పాపులారిటీ, క్రేజ్‌నే కుమారీ ఆంటీని కష్టాల్లోకి నెట్టేసింది. కుమారి ఆంటీ దగ్గరే భోజనం చేసేందుకు ఎగబడడంతో రద్దీ ఎక్కువైపోతంది. ఇక్కడకు వచ్చిన వారు రోడ్డు పైనే వాహనాలు పార్క్‌ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్‌ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ మహిళ కష్టపడుతున్న తీరు, ఆహారం ఈ మధ్య మరీ ఫేమస్ అయ్యాయి. అదే యూట్యూబర్లను ఆకర్షించింది. ఫుట్ పాత్ పై ఓ చిన్న పాకలో ఆమె భోజనం వడ్డిస్తున్న తీరు, వచ్చిన వారిని మర్యాదగా సంబోధించే విధానానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. అంతే.. ఆమె కొద్ది రోజుల్లోనే విపరీతంగా ఫేమస్ అయిపోయారు. తర్వాత ట్రోల్స్ కు కూడా గురయ్యారు. ఆ తర్వాత ఆ ట్రోల్స్ తప్పుడువని.. నెటిజన్లు అర్థం కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అదే ఇప్పుడు ఆమె వ్యాపారానికి అడ్డంకిగా మారింది. ఆమెను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన పార్టీలు వాడుకోవడం కూడా మొదలైపోయింది.దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ పక్కనున్న రోడ్‌లో మధ్యాహ్నం వేళ ఓ పాక వద్ద విపరీతమైన జనం కనిపిస్తారు. ఫుట్ పాత్‌పైన మధ్యాహ్న భోజనం తినడం కోసం కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి ఆఫీసర్ల వరకూ ఆ పాక వద్ద క్యూ కడుతుంటారు. అంతగా ఆదరణ పొందిన ఆ స్ట్రీట్ వెండర్ పేరు దాసరి సాయి కుమారి. కుమారి ఆంటీగా అందరికీ సుపరిచితం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవారికి ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. కొద్ది వారాలుగా సోషల్ మీడియాలో ఆమె ట్రోలింగ్స్ కు గురై.. తర్వాత దాని వెనక అసలు నిజాల్ని జనం తెలుసుకున్నారు.
రెండు లివర్ లు రూ.1000 బిల్ అయిందంటూ.. ఒక క్లిప్ ను విపరీతంగా వైరల్ చేయడంతో.. ట్రోలింగ్ కు గురయ్యారు. ఆ తర్వాత దాని వెనక అసలు ఏం జరిగిందనేదానిపై దాసరి సాయికుమారి క్లారిటీ ఇచ్చారు. దీంతో మళ్లీ ఆమెపై జనాల్లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రోజురోజుకూ ఆమె వద్ద భోజనం కోసం జనాలు పెరిగిపోవడం ఎక్కువైపోయింది. అన్నం తినడానికి వచ్చిన వారు వారి వాహనాలను రోడ్డుపై ఎక్కడికక్కడ పార్క్ చేస్తుండడంతో పోలీసులు ఆమె వ్యాపారాన్ని మూయించారు.
తెలియక నోరు జారిన కుమారి ఆంటీ
ఓ ఇంటర్వ్యూలో కుమారి ఆంటీ మాట్లాడుతూ.. తమకు ఆస్తులు ఏమీ లేవని, ఊళ్లో జగన్ ఇచ్చిన ఇల్లు మాత్రం ఉందని నోరు జారారు. ఇది మరో సమస్యను రేకెత్తించింది. ఆ క్లిప్‌ను వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగం వాడేసుకొని.. ‘‘సామాన్యులే నా స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం జగన్ చెప్తే.. వెటకారం చేసిన పెత్తందారులకి దిమ్మతిరిగిపోయేలా దాసరి సాయి కుమారి చేశారు. ఆమెకు తనకంటూ ఆస్తి ఉందంటే.. అది జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమే అని ఇంటర్వ్యూలో చెప్పింది’’ అని ఒక పోస్ట్ చేసింది. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ సీపీ మరో పోస్ట్ కూడా చేసింది. ఈ వ్యవహారాన్ని రాజకీయాలతో ముడిపెట్టింది. ‘‘మొత్తానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరికీ సీఎం జగన్ పేరు వింటేనే వణుకు పుడుతోంది. అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు ఉసిగొల్పారు.

జగనన్న అభిమానిని చూసినా మీకు భయం అని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు’’ అని మరో పోస్ట్ చేసింది. ఇలా దాసరి సాయి కుమారి తన మానాన తాను వీధి పక్కన వ్యాపారం చేసుకుంటుంటే.. తన ప్రమేయం లేకుండానే ఫేమస్ అయ్యారు. చివరికి ఆమె ఇంటర్వ్యూలను రాజకీయ ప్రయోజనాల కోసం కూడా వాడుతున్న తీరు కనిపిస్తోంది.