గులాబ్ తుఫాను కారణంగా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే సోమవారం సాయంత్రం.. వాతావరణ శాఖ 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని పోలీసు శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్.. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రతీ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.