వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే ఖర్చు పెట్టింది రూ.680 కోట్ల ప్రజాధనం అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఖర్చు చేసిందే రూ.140 కోట్లు అని ఆరోపించారు. ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎవరు? ఎన్ని సలహాలు ఇచ్చారు? వారికి ఎంత మేర ఖర్చు చేశారు అనే వివరాలపై ప్రభుత్వం శాసనసభ వేదికగా సమాధానం చెప్పాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. 89 మంది సలహాదారులను ప్రభుత్వం నియమించడం, వారి అర్హతలను ఎవరికి తెలియకుండా దాచిపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.సలహదారుల నియామకం విషయంలో హైకోర్టును కూడా ప్రభుత్వం తప్పుదారి పట్టించింది. తన ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నది ముఖ్యమంత్రికి కూడా తెలియదు. అసలు ఎవరి మాట పట్టించుకోని ముఖ్యమంత్రి కనీసం పాలనలో ఒక్క విలేకరుల సమావేశం కూడా నిర్వహించని ముఖ్యమంత్రి సలహాదారుల నుంచి ఏం సలహాలు తీసుకున్నారో ప్రజలకు తెలియాలి. వారు ఇచ్చే సలహాలను సీఎం నిజంగా తీసుకుని అమలు చేస్తున్నారా. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించకుండా ఐబీ సిలబస్ అమలు అంటున్నారు.
ఏ సలహాదారు చెబితే ఈ విద్యా విధానంలో మార్పు తెచ్చారు. ఈ సలహాదారుల వల్ల ప్రజలకు, రాష్ట్రానికి జరిగిన మేలు ఏంటో ప్రభుత్వం చెప్పగలదా? ఎంతమంది సలహాదారులు ఉన్నారు.. వారెవరో.. కనీసం ముఖ్యమంత్రికి కూడా తెలియదు’’సీఎంతో రోజూ మాట్లాడేది కేవలం ఇద్దరు సలహాదారులు మాత్రమే. సీఎం మీడియా ముందుకు వచ్చి.. తాను పెట్టుకున్న సలహాదారులు వివరాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రూ.140 కోట్లు ఒక్క సజ్జల కోసం ఖర్చు చేస్తే ఏమనుకోవాలి. ప్రభుత్వ సొమ్మును తీసుకొంటూ.. ప్రతిపక్షాలను సజ్జల విమర్శిస్తారా? జగన్ కు చిత్తశుద్ది ఉంటే.. ఏపని కోసం సలహాదారులను అమలు చేశారు. వారు ఇచ్చిన సలహాల వల్ల ఏ అంశాలలో మార్పు జరిగాయో పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎంను డిమాండ్ చేస్తున్నాం. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి సలహాదారుల కోసం 680 కోట్లు ఖర్చు పెడతారా? ఏ బడ్జెట్ కింద ఈ డబ్బు ఖర్చు పెట్టారో రేపు శాసనసభ సమావేశాల్లో చెప్పాలి.
అసలు సలహాదారుల్లో ఎంతమందికి ఆ అర్హత ఉందో చెప్పగలరా? ఒక్క సజ్జల కోసం 140 కోట్లు ఎలా ఖర్చు పెట్టారో సీఎం ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందే.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మభ్యంతరం బడ్జెట్ భవిష్యత్తు భారతానికి ఒక దిక్సూచి. పర్యాటక రంగానికి పెద్దపీట వేయడం, పేదలకు ఇల్లు నిర్మాణం విషయంలో కేంద్రం ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పడం హర్షించదగిన పరిణామం. రైతులు, యువత, మహిళలకు స్వాంతన చేకూర్చే కొన్ని పథకాలను ప్రవేశ పెట్టడం బాగుంది. సౌర విద్యుత్తును ప్రోత్సహించేలా 300 యూనిట్ల కరెంటును ఉచితంగా అందించే పథకం అభినందనీయం’’ అని కొనియాడారు.