తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పిడుగులు పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వర్షం కురిసే సమయంలో అవసరం అయితే బయటకు వెళ్లాలన్నారు.
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతుపవనాలు బలపడటం, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఏపీ తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు. అది సగటు సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో నేడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈదురు గాలులకు తోడు ఉరములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని.. పిడుగు పాట్లకు గురయ్యే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం వేళలో ఉష్ణోగ్రతలు 30-32 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉంటాయని చెప్పారు. సాయంత్రానికి వాతావరణం చల్లబడుతుందని వెల్లడించారు. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని నగర ప్రజలకు అధికారులు సూచించారు.
ఇక ఈ ఏడాది ఆశించినంతగా వర్షాలు కురవటం లేదు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా.. కొన్ని జిల్లాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. జులైలో కురిసే వర్షాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో ఇప్పటికే 10 రోజులు పూర్తవగా.. మిగిలిన రోజుల్లో వరుణుడి కరుణ ఎలా ఉంటుందో చూడాలి మరి.