ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జంపింగ్ లు ఊపందుకుంటున్నాయి. నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ వివిధ పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా భారత రాష్ట్ర సమితి ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ ఓటమి చవిచూడడం.. జాతీయ పార్టీ విస్తరణ అంశం పక్కకు వెళ్లడం.. బిఆర్ఎస్ తెలంగాణకే పరిమితం కావడం వంటివి చంద్రశేఖర్ పార్టీ మారేందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికే మాజీమంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరారు. దీంతో తోట చంద్రశేఖర్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు.తెలంగాణలో కేసీఆర్ ఓటమితో భారత రాష్ట్ర సమితి విస్తరణ మరుగున పడిపోయింది. కెసిఆర్ పిలుపుమేరకు తోట చంద్రశేఖర్ జనసేనను వీడి బిఆర్ఎస్ లో చేరారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఏదో ఒకచోట పోటీ చేయాలని భావించారు. కానీ తెలంగాణలో కేసీఆర్ కు ఓటమి ఎదురు కావడంతో ఏపీలో ఆ పార్టీ విస్తరణకు అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి చంద్రశేఖర్ కు చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుండి చంద్రశేఖర్ పనిచేశారు.
పవన్ జనసేన ఏర్పాటు నుంచి సైతం వెన్నంటి నడిచారు. కానీ కెసిఆర్ పిలుపుమేరకు ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు.అయితే తాజాగా ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. తోట చంద్రశేఖర్ జనసేన లో చేరతారని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా జనసేన నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కానీ అధికారికంగా ఆ విషయాలు బయటకు రావడం లేదు. కానీ ఆయన చిరంజీవితో పాటు పవన్ ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించడంతో మర్యాదపూర్వకంగా కలిశానని చంద్రశేఖర్ చెబుతున్నారు. కానీ ఆయన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తో కలిసి ఈనెల నాలుగున జనసేనలో చేరతారని బలంగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని బాలశౌరికి పవన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.తోట చంద్రశేఖర్ ప్రజారాజ్యం పార్టీలో సైతం పోటీ చేశారు. గత ఎన్నికల్లో జనసేన తరుపున సైతం బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో సైతం పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఆయన జనసేనలో చేరితే గుంటూరు వెస్ట్ సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. తోట చంద్రశేఖర్‌తో పాటు ఏపీలో బిఆర్‌ఎస్ ఏదో అద్భుతాలు చేసేస్తుందని ఆశించి భంగపడిన రావెల కిశోర్‌బాబు రెండు రోజుల క్రితం వైసీపీ గూటికి చేరిపోయారు. తోట చంద్రశేఖర్‌తో పోలిస్తే రావెల కిశోర్‌బాబు కనీసం చట్టసభలో అడుగు పెట్టే అవకాశమైనా లభించింది. ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. పలు పార్టీలు మారినా పలితం లేకపోవడంతో చివరకు వైసీపీలో తేలారు.మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్‌గా 23 ఏళ్లపాటు పనిచేసిన చంద్రశేఖర్ ఆ పదవికి రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పటికే స్థిరాస్తి వ్యాపారాల్లో సత్తా చాటుకున్న తోట చంద్రశేఖర్ 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.2014లో వైసీపీ అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి పరాజయం పాలయ్యారు. 2019లో జనసేన పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు.
ముచ్చటగా మూడు సార్లు మూడు పార్టీల నుంచి పోటీ చేసినా ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో నాలుగోసారి పోటీకి రెడీ అవుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఈ నెల 4న పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.2019 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన మద్దాలి గిరి గెలుపొందారు. ఎన్నికల అనంతరం వైసీపీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ టిడిపి,జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తానని తోట చంద్రశేఖర్ భావిస్తున్నారు. అయితే పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. అన్ని కుదిరితే బాలశౌరితో పాటు చంద్రశేఖర్ సైతం జనసేనలో చేరడం ఖాయంగా తేలుతోంది.2019 ఎన్నికల ఫలితాల తర్వాత కొంత కాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన తోట చంద్రశేఖర్, రావెల కిశోర్‌లు అనూహ్యంగా ఏపీ బిఆర్‌ఎస్ బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యక్రమాల కోసం గుంటూరులో ఏకంగా పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఏపీ రాష్ట్ర శాఖను ఆర్బాటంగా ప్రకటించినా ఆ తర్వాత మాత్రం దాని అచూకీ లేకుండా పోయింది.
ఒక్కటంటే ఒక్కటి కూడా సమావేశాన్ని బిఆర్‌ఎస్ ఏపీలో నిర్వహించ లేకపోయింది. ఒకటి రెండు సార్లు ప్రెస్‌మీట్లు తప్ప బిఆర్‌ఎస్ తరపున ఏపీలో చెప్పుకోదగిన కార్యక్రమాలు ఏమి నిర్వహించలేదు.తెలంగాణ ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు బిఆర్‌ఎస్ పేరుతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్, సోలాపూర్ వంటి ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ఈ కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణకు పొరుగూనే ఉన్న ఏపీలో మాత్రం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర శాఖ ఏర్పాటు నుంచి చెబుతూ వచ్చినా అది మాటలకే పరిమితం అయ్యింది.
ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం ఎందుకని కేసీఆర్ భావించారో, ఏపీలో ఉన్న నాయకులు ఆసక్తి చూపించలేదో కాని ఏపీ బిఆర్‌ఎస్ మాత్రం ఎలా వచ్చిందో అలాగే నిష్క్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఏపీని సీరియస్‌గా తీసుకునే అవకాశాలు లేవు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏపీలో బిఆర్‌ఎస్ బాధ్యతలు భుజానికి ఎత్తుకునే నాయకులు కూడా ఉండకపోవచ్చు.