ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకహోదా అనేది భారీ ఎన్నికల ప్రచార అంశం. రెండు ఎన్నికలను ఆ అంశం ప్రభావితం చేసింది. అయితే రెండు సార్లు హామీ నెరవేరలేదు. రెండు సార్లు రెండు రాజకీయ పార్టీలు లాభపడ్డాయి. ఇప్పుడు మరో సారి ఆ టాపిక్ ను ఎత్తేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దూకుడుగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీక్షలు , ధర్నాలతో ముందుకు వెళ్తోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా అదే చేస్తున్నారు. ఇతర ప్రజా సంఘాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల్లో ఈ అంశం ద్వారా ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా అంశంపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పుడో మాట్లాడటం మానేశాయి. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రత్యేకహోదాను ఎన్నికల అంశంగా చేసేందుకు ఆసక్తిగా లేవు. కానీ షర్మిలతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ జేడీ లక్ష్మినారాయణ హోదా అంశాన్ని గట్టిగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ రాజకీయాలకు ముడి పెడుతున్నారు.
ఇటీవల వీవీ లక్ష్మినారాయణ ఈ అంశంపై దూకుడుగా మాట్లాడుతున్నారు. ప్రజా సంఘాల సాయంతో ఆయన దీక్షలు కూడా నిర్వహిస్తారు. ప్రజలలో చైతన్యం రావాలి.. ఏపీకి ప్రత్యేక హోదా విషయం పోరాడాలి అని పిలుపునిచ్చారు జై భారత్ పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాణ.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పాస్ కాకుండా చూడాలని ఆయన అంటున్నారు. 2019 నుంచి ప్రతిసారీ రాష్ట్రానికి చెందిన ఉభయపార్టీలు.. ఎన్టీఏకు మద్దతు పలికాయని.. 14వ పైనాన్స్ కమిషన్ ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పలేదని లక్ష్మినారాయణ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే ఇవ్వొచ్చని కమిషన్ చెప్పిందని ఆయనంటున్నారు.ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రత్యేకహోదా అస్త్రంలో ప్రధానంగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ధర్నా కుడా చేశారు. పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయాలని వివిధ పార్టీల నేతల్ని కూడా కలిశారు. కొంత మంది ఏఐసీసీ నేతలతో కలిసి ఏపీ భవన్ లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకహోదా విషయంలో ప్రస్తుతం సీఎం జగన్ గతంలో చేసిన భారీ ప్రకటనల్ని మీడియా ముందుకు వినిపించారు. పార్టీలన్నీ ఏపీని మోసం చేశాయని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదాను ఇస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. గతంలోనూ ఆదే ప్రధాన హామీగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేకపోవడంతో ఆ హామీకి విలువ లభించలేదు. కానీ ఇప్పుడు షర్మిల లాంటి నాయకత్వం రావడంతో.. హోదా అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. షర్మిల కూడా ఇదే అంశాన్ని హైలెట్ చేయాలనుకుంటున్నారు. ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. హోదా అంశంపబై చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీకి మరింత మేలు జరిగే అవకాశం ఉందిప్రత్యేకహోదాను ఎన్నికల అంశంగా చేయడానికి షర్మిల, లక్ష్మినారాయణ ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ప్రత్యేకహోదా వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని జగన్ చెప్పారు. ఇన్‌కంట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరంలేదని జగన్ గొప్పగా చె్ప్పేవారు. ప్రతీ నెలా దీక్షలు చేసేవారు. విద్యా సంస్థల్లో సమావేశాలు పెట్టారు. విద్యార్తులతో ఆవేశపూరిత ప్రసంగాలు ఇప్పించేవారు. ఆయన శ్రమ ఫలించింది.. ఇరవై రెండు ఎంపీ సీట్లు గెల్చుకున్నారు.
కానీ హోదా కోసం ఆయన ఈ ఐదేళ్లలో చిన్న ప్రయత్నం కూడా చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ ఎంపీల మద్దతు కీలకం అయినప్పుడు కూడా ఎలాంటి షరతులు పెట్టలేదు. దీంతో జగన్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు హోదా అంశాన్ని మొత్తంగా పక్కన పెట్టేశారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇదే ఎన్నికల అంశం అయింది. హామీైలు ఇచ్చిన రాజకీయ పార్టీలు లాభపడ్డాయి. కానీ హోదా మాత్రం రాలేదు. దీంతో ఈ అంశంపై ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయినట్లయింది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్, జై భారత్ నేషనల్ పార్టీలు కలిసి హోదా అంశంపై ప్రజల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.ప్రత్యేకహోదా అంశాన్ని రెండు ఎన్నికల్లో వాడేశారు కానీ ప్రత్యేకహోదా రాలేదు. చంద్రబాబు హయాంలో ప్రత్యేక ప్యాకేజీ అయినా వచ్చింది కానీ.. వైసీపీ హయాంలో అసలు ఊసే లేదు. కావాల్సినన్ని అప్పులు ఇస్తున్నారు కదా.. అదే హోదా అనుకున్నారన్న సెటైర్లు వినిపిస్తూ వస్తున్నాయి.
అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలు మళ్లీ ప్రత్యేకహోదా అంటే ప్రజలు ఎంత మేర నమ్ముతారన్న సందేహాలు సహజంగానే వస్తున్నాయి. ప్రజల్ని నమ్మించగలిగితే.. ఆ నినాదం ఎత్తుకున్న వారికి రాజకీయంగా మేలు జరుగుతుంది. షర్మిల ఈ విషయంలో కాస్త దూకుడుగా ఉన్నారు.